హైదరాబాద్ బ్రాండ్‌ను గూండాయిజంతో దెబ్బతీస్తారా?

2
- Advertisement -

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న మెటా కార్యాలయం వద్ద తెలంగాణ యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ నిరసన చేపట్టడం, కార్యాలయంపై దాడికి పాల్పడటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్న జరిగిన ఘటన కేవలం కార్యాలయ అద్దాలను మాత్రమే ధ్వంసం చేయలేదని, దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ సంపాదించుకున్న విశ్వసనీయతను, పెట్టుబడిదారుల్లో ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న హైదరాబాద్ బ్రాండ్ ఒక్కరోజులో ఏర్పడలేదని, అనేక సంవత్సరాలపాటు అనుసరించిన, వ్యాపార అనుకూల విధానాలు, తాము కష్టపడి నిర్మించిన పారిశ్రామిక వాతావరణం ఫలితంగానే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని కేటీఆర్ పేర్కొన్నారు.

అనేక ప్రయత్నాల తర్వతా మెటా సంస్థ తన భారతదేశంలోని అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందని, నగరంలో సురక్షితమైన, అనుకూలమైన పని వాతావరణం ఉంటుందని తాము హామీ ఇచ్చి భరోసా కల్పించినందుకే మెటా సంస్థ తన అతిపెద్ద కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకుందని కేటీఆర్ గుర్తుచేశారు.

సోషల్ మీడియా ఖాతాలను మెటా నిలిపివేయడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ మూర్ఖులు మెటా కార్యాలయాన్ని ధ్వంసం చేయడం గొప్ప విషయంగా భావించడమే కాకుండా, దాన్ని బహిరంగంగా గొప్పగా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ తీరుకు నిదర్శనమని విమర్శించారు.

Also read:Jeera: జీలకర్రతో హెల్తీ డ్రింక్స్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో మెటా వంటి ఒక్క పెద్ద అంతర్జాతీయ బ్రాండ్‌నైనా హైదరాబాద్‌కు తీసుకురాగలిగిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కంపెనీలను భారత్‌కు తీసుకురావడానికి గూండాయిజమే మార్గమని రాహుల్ గాంధీ భావిస్తున్నారా? అని నిలదీశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న మీ పార్టీ కూడా ఇదే తరహాలో గూండాయిజం చేస్తూ కంపెనీలను తీసుకొచ్చే కొత్త విధానానికి శ్రీకారం చుట్టారా? అని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు.

- Advertisement -