మహిళలు ఆర్థికంగా బలపడితేనే సమాజంలో వారికి సరైన గుర్తింపు, గౌరవం లభిస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, అమ్మాయిలు తమ కాళ్లపై తాము నిలబడితే వచ్చే గౌరవం, స్వాతంత్ర్యం వేరు అని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, వారికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని పేర్కొన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. భరోసా కేంద్రాలు, సఖీ సెంటర్లు, షీ టీమ్స్, వీ హబ్ వంటి కార్యక్రమాలతో పాటు కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, కల్యాణ లక్ష్మి వంటి పథకాల ద్వారా మహిళలకు సహాయం అందించామని తెలిపారు.
అలాగే కేసీఆర్ నాయకత్వంలోనే స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. భవిష్యత్తులో కూడా మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా బీఆర్ఎస్ కట్టుబడి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read:‘శ్రీనివాస మంగాపురం’…అప్‌డేట్
ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్‌కు గులాబీ శ్రేణులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళల సాధికారతకు బీఆర్ఎస్ ఎప్పటికీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.

