పారిశ్రామిక పాలసీల్లో దేశానికే అదర్శం తెలంగాణ

582
ktr
- Advertisement -

తెలంగాణ గత ఐదున్నర సంవత్సరాలుగా అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధిస్తుందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే.టి రామారావు అన్నారు. ఇవాళ ఢిల్లీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ఇండియా ఎకనామిక్ సమ్మిట్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేఘాలయా, మద్యప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కూడిన “యూనియన్ అఫ్ స్టేట్స్” సెషన్ లో ఆర్థిక ప్రగతి సాధించేందుకు కేంద్ర రాష్ట్రాల సంబంధాల పైన ఆయన తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అనేక పాలసీలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే అధికారం ఉన్నప్పటికీ అసలైన యాక్షన్ క్షేత్రస్థాయిలో రాష్ట్రాల్లోనే ఉన్నదని తెలిపారు. అభివృద్ధి పూర్వకమైన (ప్రొగెస్సివ్ లీడర్ షిప్) నాయకత్వం ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడుతుందని ఇందుకు తెలంగాణనే ఒక ఉదాహరణ అని తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన టీఎస్ ఐపాస్ చట్టం అనేక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. దేశంలో పరిశ్రమల అనుమతులు, వాటిలో ప్రభుత్వాల పాత్ర విషయంలో ఈ చట్టం ద్వారా ఒక విస్తృతమైన చర్చకు తెర లేచిందన్నారు. తాము రూపొందించిన టి ఎస్ ఐసాస్ చట్టం ద్వారా ఇప్పటికే 11 వేలకు పైగా అనుమతులను ఇచ్చామని, ఇందులో 8400 పైగా అనుమతులు కార్యరూపం దాల్చాయని తెలిపారు. ఈ చట్టం వచ్చిన తర్వాత సుమారు 12 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని తెలిపారు. దీంతోపాటు రెండుసార్లు తెలంగాణ రాష్ట్రం ఈజ్ అఫ్ డూయింగ్ బిజిసెస్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు.

కేంద్రం రాష్ర్టాలతో సమన్వయంతో కలిసి ఒక ఎకానామిక్ విజన్ కోసం పనిచేసినప్పుడే దేశ ఆర్థిక ప్రగతి వేగవంతం అవుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర జాబితాలతో పాటు ఉమ్మడి జాబితా అంటూ రాజ్యాంగం ప్రత్యేకంగా అధికారాలను నిర్ణయించిందని అయితే మారిన పరిస్ధితుల నేపథ్యంలో ఉమ్మడి జాబితాలో ఉన్న అనేక అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర అప్పగించాల్సిన సమయం ఆసన్నమైనదన్నారు. అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే ఆర్థిక అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. తమ రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ స్పూర్తి బలంగా ఉందని అందుకే తెలంగాణ ఏర్పడ్డాక ఉన్న పది జిల్లాల నుంచి 33 జిల్లాలు మరియు అనేక నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామని తెలిపారు.

జాతిపిత మహాత్మా గాంధీ చెప్పినట్లు ఇప్పటికీ దేశం పల్లెల్లోనే నివసిస్తున్నదని, అయితే దేశాన్ని, రాష్ట్రాలను ఆర్థికంగా నడిపిస్తువి కచ్చితంగా నగరాలు పట్టణాలే అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా జీవితంలో మరింత ఉన్నతమై అవకాశాల కోసం ప్రజలు కచ్చితంగా పట్టణాలవైపు చూస్తున్నారన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రజానీకానికి అత్యుత్తమ విద్య, వైద్య సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అయితే పెద్ద ఎత్తున పట్టణీకరణ జరుగుతున్న నేపద్యంలో పట్టణాల్లో మౌలిక వసతుల సంక్షోభం తలెత్తుతుందని తెలిపారు. దేశంలో ఇలాంటి సమస్యలకు అవసరమైన ఐడియాలకు ఎలాంటి కొరత లేదని కేవలం అలోచనలు కార్యరూపం దాల్చేందకు కావాల్సిన క్యాపిటల్ కొరత మాత్రమే ఉన్నదని అన్నారు. పట్టణాల్లో మౌళిక వసతుల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక విదేశీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని, అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణ వలన స్వేచ్ఛగా రాష్ట్రాల్లోకి పెట్టుబడులు పెట్టలేకపోతున్నాయని, ఈ విషయంలో కేంద్రం ఒక సహాయకారిగా నిలవాలి కానీ అడ్డు కాకుడదని, ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం కొంత సరళతరమైన నిబంధనలతో ముందుకు రావాలన్నారు. అప్పుడే పట్టణాల్లో మౌలిక వసతులను పెంచడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలను అభివృద్ధి పరిచేందుకు విస్తృతమైన అవకాశాలు కలుగుతాయని తెలిపారు.

ఈరోజు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ అక్కడికి హాజరైన కంపెనీలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, ఇక్కడి పెట్టుబడి అవకాశాలను వారికి వివరించారు. మంత్రి కేటీఆర్ తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి  ఉన్నారు.

- Advertisement -