తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన నాయకులు హాజరయ్యారు. కేక్ కట్ చేసి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… ఏ జాతి నీది? ఏ జాతికి జాతిపిత?” అని ప్రశ్నించిన వారిపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయని, ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి అని వ్యాఖ్యానించారు. “మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది ట్రెయిటర్ల జాతి” అంటూ ఘాటుగా విమర్శించారు.
తెలంగాణ చరిత్రను ప్రస్తావిస్తూ రాణి రుద్రమదేవి నుంచి కొమరం భీమ్ వరకు, సమ్మక్క-సారలమ్మల నుంచి సర్దార్ సర్వాయి పాపన్న వరకు, దొడ్డి కొమురయ్య నుంచి చాకలి ఐలమ్మ వరకు అనేక వీరుల త్యాగాలను గుర్తుచేశారు. సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ, తిరుగుబాటు వీరుడు తుర్రెభాస్ ఖాన్, కాళోజీ, దాశరథి వంటి మహనీయుల ఆత్మగౌరవ స్పూర్తి తెలంగాణ జాతికి ప్రాణమని అన్నారు.
1952 గైర్ ముల్కీ ఉద్యమం, 1969 తెలంగాణ పోరాటం, మలిదశ ఉద్యమంలో అమరులైన యువత త్యాగాలు తెలంగాణ ఆత్మగౌరవానికి పునాది అని పేర్కొన్నారు. “అణువణువునా ఆత్మగౌరవం తొణికిసలాడే జాతి మాది. ఢిల్లీకి సలాం కొట్టి బ్రతికే సామంతులం మేము కాదు. నిటారుగా నిలబడే వెన్నుముక ఉన్న భూమిపుత్రుల జాతి మాది” అని అన్నారు.
Also Read:కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తున్నా!
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌పై, తెలంగాణ గౌరవంపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వారికి మాత్రమే జాతి గౌరవం అర్థమవుతుందని చెప్పారు. సమైక్యాంధ్ర వాదులకు తెలంగాణ ఆత్మగౌరవం తెలియదని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

