BRS:కేసీఆర్‌కు నోటీసులపై కేటీఆర్ ఫైర్

4
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలంటూ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఇలాంటి వైఖరి ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. స్వయంగా కేసీఆర్ తన ప్రస్తుత నివాస చిరునామాతో పోలీసులకు సమాధానం ఇచ్చినప్పటికీ, ఆయన లేని సమయంలో రాత్రివేళ పాత నివాసానికి వచ్చి గోడకు నోటీసులు అంటించడం దారుణమని మండిపడ్డారు. ఇది అహంకార ధోరణి కాకపోతే మరేమిటని నిలదీశారు.

65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారి నివాసంలోనే విచారించాలన్న నిబంధనను కూడా పోలీసులు ఉల్లంఘిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌పై అవగాహన ఉందా? లేక ప్రతిపక్ష నేతలను వేధించడమే వారి పని అయిపోయిందా? అని ప్రశ్నించారు. చట్టం, న్యాయం, ధర్మంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఈ అక్రమ కేసులన్నింటినీ ఎదుర్కొని నిజాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తామని స్పష్టం చేశారు.

Also Read:మహా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్!

ఇదిలా ఉండగా, శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వచ్చిన సిట్ అధికారులు, ఎవరూ లేని సమయంలో గోడకు నోటీసులు అంటించి వెళ్లారు. 160 సీఆర్పీసీ కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో, ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని అధికారిక నివాసంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. అధికారిక రికార్డుల ప్రకారమే విచారణ స్థలం నిర్ణయించాల్సి ఉంటుందని, దర్యాప్తుకు అవసరమైన సున్నితమైన రికార్డులను ఎర్రవల్లికి తరలించడం సాధ్యం కాదని నోటీసుల్లో సిట్ అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -