KTR:రేవంత్..భీమవరం బుల్లోడు

5
- Advertisement -

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ విభేదాలకే పరిమితం కాకుండా, వ్యక్తిగత వ్యాఖ్యల వరకూ వెళ్లిన ఆయన ప్రసంగం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి దుమారం రేపుతోంది. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి.

“రేవంత్ రెడ్డి కనిపిస్తే ఎడమ కాలి చెప్పు తీసుకొని తన్నాలనిపిస్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి అదుపులో పెట్టుకుంటున్నాను” అన్నారు. కేసీఆర్ తన తండ్రి అని పేర్కొన్న కేటీఆర్, ఆయనపై అనరాని మాటలు మాట్లాడినందుకు తనకు గొంతు వరకు కోపం ఉందన్నారు. తన విద్యాభ్యాసంపై రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను కూడా కేటీఆర్ తిప్పికొట్టారు. “నేను గుంటూరులో చదువుకుంటే తప్పట కానీ, ఆయన మాత్రం ఆంధ్రా నుంచి అల్లుడిని తెచ్చుకుంటే తప్పు కాదా?” అని ప్రశ్నించారు. ఆంధ్రా నుంచి అల్లుడిని తెచ్చుకున్నందుకు చిట్టినాయుడు పేరును ‘భీమవరం బుల్లోడు’గా పెట్టాలని ఎద్దేవా చేశారు. “నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొప్పి?” అంటూ ఘాటుగా స్పందించారు.

తన చదువు, జీవనశైలిపై వ్యాఖ్యానించే అర్హత రేవంత్ రెడ్డికి లేదని కేటీఆర్ అన్నారు. “నేను ప్రపంచమంతా చదువుకున్నాను. నీలా సదువు సంధ్య లేకుండా తిరగలేదు. నీ అమ్మానాన్న నీకు సరైన దారి చూపించకపోతే అది నా తప్పా?” అంటూ విమర్శించారు.

తన తండ్రి కేసీఆర్‌పై కేటీఆర్ గర్వంగా మాట్లాడారు. “మా అయ్య మొగోడు, మొనగాడు. తెలంగాణ తెచ్చినోడు. బారాబర్ మా అయ్య పేరు చెప్పుకుంటాను. నువ్వు మంచి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. లుచ్చా పనులు చేస్తే నీ మనవడు కూడా నీ పేరు చెప్పడు” అంటూ హెచ్చరించారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో “కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు” మాత్రమే జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చుతున్నారని, కాళేశ్వరంలో మేడిగడ్డను పేల్చారని, ఇప్పుడు చెక్‌డ్యామ్‌లు పేల్చి ఇసుక అమ్ముకుంటున్నారని ఘాటు విమర్శలు చేశారు.

- Advertisement -