తెలంగాణ, ఆంధ్ర విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చిన కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్, హరీష్ రావు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరవీరుల త్యాగాలను అవమానిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వం అన్నారు.
ఇలాంటి అహంకారపూరిత, వ్యతిరేక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఈ వ్యాఖ్యలపై తేజస్వీ సూర్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు కేటీఆర్.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థుల, యువత, ఉద్యోగుల, ప్రజల త్యాగాల ఫలితం అన్నారు.అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమే, అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమేనన్నారు.
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు హరీష్ రావు.

