తెలంగాణ భవన్‌లో మంత్రులు కేటీఆర్,జూపల్లి,లక్ష్మారెడ్డి సమక్షంలో కల్వకుర్తి నగర పంచాయతీ ఛైర్మన్ శ్రీశైలంతో పాటు కాంగ్రెస్,టీడీపీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు నేతలు 1800 మంది టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..కల్వకుర్తి రాజకీయ చైతన్యానికి ప్రతీక అన్నారు. ఎన్టీఆర్‌ని ఓడించి రాజకీయ చైతన్యానికి ప్రదర్శించిన ఘనత కల్వకుర్తి ప్రజలది అన్నారు.
కల్వకుర్తి నుంచి ఎంతోమంది నాయకులు ఎదిగినా అక్కడి ప్రజల జీవితాల్లో మార్పురాలేదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాలమూరు పచ్చబడి
తీరుతుందన్నారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున సాగునీరు అందించి తీరుతామన్నారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా పాలమూరు అభివృద్ది చెందాల్సిఉందన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీతో కల్వకుర్తికి మేలు జరుగుతుందన్నారు.
సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. పరిశ్రమలు, ఉద్యోగాలు రాకుండా కాంగ్రెస్ అడ్డుపడుతోందన్నారు. 24 గంటల కరెంట్ రైతులకు ఇస్తున్న మనసున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే అభివృద్ధి నిరోధకుడిగా మారాడని ఆరోపించారు. పాలమూరు రైతుల నోట్ల మట్టికొట్టే ప్రయత్నాలు ఇప్పటికైనా మానాలని హితవు పలికారు కేటీఆర్.