నీట్ వ్యవహారంపై ప్రధాని స్పందించాలి

13
- Advertisement -

కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మండిపడ్డారు. ఓవైపు బీహార్ లో 30 లక్షల చొప్పున నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. ఆది నుంచి నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని విమర్శించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్ పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మోడీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు… ప్రతీసారి విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని.. కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థులకు, లక్షలాదిమంది తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్ లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం ఎన్నోరకాల అనుమానాలకు తావిస్తోందని ధ్వజమెత్తారు. అందులో కూడా ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే.. పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయని, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారని గుర్తుచేశారు. అలాంటిది.. ఇంత ఒకే సెంటర్ లో ఇంతమంది విద్యార్థులకు పెద్దమొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. అలాగే ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు.. అసలు ఈ వ్యవహారం బయటకు రాగానే పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన కేంద్రం ప్రభుత్వం ఎందుకు ఈ అంశాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదని నిలదీశారు. పైగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

లక్షల మంది విద్యార్థులు ఎన్ని ఫిర్యాదులు చేసిన కేంద్రం స్పందించలేదని, పలువురు ప్రముఖులు సుప్రీంకోర్టులో కేసు వేసినా ఒక్క వివరణ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కూడా కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చాలా చిత్రమైన సమాధానాలు చెప్పిందన్నారు. ఈ ఏడాది 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు చెబుతోందని, అసలు నీట్ లాంటి ఎగ్జామ్ లకు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదని, అయినప్పటికీ ఎందుకిలా చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 1563 మంది విద్యార్థులకే ఎందుకు గ్రేస్ మార్కులు ఇచ్చారో…. దానికి ఏ ప్రాతిపదికను తీసుకున్నారో స్పష్టం చేయటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. +4, -1 విధానం ఉండే ఈ ఎగ్జామ్ లో సాధ్యం కాని విధంగా కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావటం కూడా మొత్తం గ్రేస్ మార్కుల విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ మొత్తం అంశం వివాదం కావటంతో ఇప్పుడు ఎన్టీఏ 1563 మందికి విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని వాటిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిందన్నారు. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు వాటిని తొలగించి మళ్లీ ఎగ్జామ్ రాయిస్తామని లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా ఉన్న ర్యాకింగ్ నే జత చేస్తామని పూటకో మాట మాట్లాడుతోందని మండిపడ్డారు.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ను ప్రమాదంలోకి నెట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు రాకుండా నానాతంటాలు పడుతున్నారని మండిపడ్డారు.

ఒక్క గ్రేస్ మార్కుల అంశమే కాకుండా నీట్ పేపరే లీకైందంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. దీనికి బలం చేకూరే విధంగా గుజరాత్, బీహార్ లో పోలీసులు నీట్ లో అవకతవకలు పాల్పడిన కొంతమందిని అరెస్ట్ చేశారని, వరుసగా బయటపడుతున్న వివాదస్పద వ్యవహారాల కారణంగా నీట్ ఎగ్జామ్ తీరుపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు కూడా అనుమానాలు బలపడుతున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నీట్ ఎగ్జామ్ ను పెద్దసంఖ్యలో విద్యార్థులు రాశారని, నీట్ లో జరిగిన గ్రేస్ మార్కులు, పేపర్ లీకేజీ ఆరోపణల కారణంగా తెలంగాణ విద్యార్థులు కూడా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు మన రాష్ట్ర ఎంపీలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించే విధంగా రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు ఎన్డీఏ సర్కారుపై ఒత్తిడి తేవాలని కోరారు. ఇంత జరగుతున్నా ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా కేంద్రం చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాల్సిన అవసరముంది. లక్షలాది విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన ఈ అంశంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వెంటనే ప్రధాని దీనిపై స్పందించి మొత్తం అవకతవకలకు బాధ్యులెవరన్నది దేశ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.. నీట్ లో జరిగిన అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థులకు ఇబ్బంది లేకుండా, వారికి న్యాయం చేసే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఇందులో ఎన్టీఏ NTA – పాత్ర పై అత్యున్నత దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని, పేపర్ లీకేజీలకు పాల్పడిన వారితోపాటు.. అక్రమంగా లబ్దిపొందిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అత్యంత ప్రతిష్టాత్మక నీట్ ఎగ్జామ్ మాత్రమే కాదు… దేశంలోని ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్టీఏ ఆధ్వర్యంలోనే జరుగుతున్నందున తాజాగా బయటపడ్డ వివాదస్పద అంశాల కారణంగా ఎన్టీఏ పై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్నారు.. నీట్ లో అక్రమాల కారణంగా కష్టపడి చదివిన మన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగినా అసలు ఊరుకునే ప్రసక్తే లేదని, వారి తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టంచేశారు.

Also Read:గం గం గ‌ణేశా..ఓటీటీ డేట్ లాక్!

- Advertisement -