టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని స్పష్టం చేశారు కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన కేటీఆర్..కోదండరాం స్థాపించిన తెలంగాణ జనసమితి(టీజేఎస్) కాంగ్రెస్ భజన సమితిలా మారిపోయిందన్నారు. సోనియా గాంధీని ఇష్టం వచ్చినట్లు తిట్టిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్‌కు సిగ్గులేదా అని ప్రశ్నించారు.
తెలంగాణ రైతులకు కాంగ్రెస్,టీడీపీలే శత్రువులని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని.. త్వరలో రైలు సౌకర్యం కల్పించబోతున్నట్లు తెలిపారు.ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కృసి చేస్తానని తెలిపారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే అని ప్రకటించిన విపక్షాలు ఇప్పుడు భయపడుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రానికి 30 లేఖలు రాసిన చంద్రబాబుతో ఏవిధంగా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు. కూటమిలో ఒక్కోపార్టీది ఒక్కో ఎజెండా అని పొరపాటునా కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు ప్రాజెక్టులను కట్టనిస్తాడా అని తెలిపారు.
సిరిసిల్ల రూపు రేఖలు మారబోతున్నాయి. వ్యవసాయంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు లాభం చేకూరుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలంటే కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్నారు.