తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్లో జెండా ఎగురవేయనున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరించనున్నారు. ఉదయం 8 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
ఇక నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ ఆవిర్భావ వేడుకలకు అంగరంగవైభవంగా సిద్ధమైంది. సుమారు ఐదువేల మంది కూర్చునేవిధంగా ఏర్పాట్లుచేస్తున్నారు. ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటుతోపాటు వేసవి దృష్ట్యా మంచినీటి సౌకర్యాన్ని జలమండలి ద్వారా కల్పించారు.
మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ఉదయం 9 గంటల నుంచి 10.30 మధ్య ఉత్సవాలను నిర్వహించనున్నారు. 10.30లకు సీఎస్ ఆధ్వర్యంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తారు. 11 గంటలకు రాష్ట్రావతరణ అంశంపై కవి సమ్మేళనం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం పురస్కార ప్రదానోత్సవం ఉండనుంది.