ఐపీఎల్ 2026 వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ వ్యూహాలపై మాజీ భారత క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. డిసెంబర్ 16న జరగనున్న వేలాన్ని దృష్టిలో ఉంచుకొని, ఫ్రాంచైజీలు తమ జట్లను బలపర్చేందుకు వ్యూహాలు రచిస్తున్న సమయంలో శ్రీకాంత్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
మార్చి 2026లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందు, 10 జట్లు ఉత్తమ ఆటగాళ్లను దక్కించుకునేందుకు తీవ్ర పోటీకి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, తొలి సీజన్ విజేతలైన రాజస్థాన్ రాయల్స్ పరిస్థితిపై శ్రీకాంత్ ప్రత్యేకంగా మాట్లాడారు.
రాజస్థాన్ రాయల్స్ వేలంలో లక్ష్యంగా పెట్టుకోవాల్సిన ఆటగాళ్లపై సూచనలు చేశారు. వైభవ్ సూర్యవంశీ జీటీపై శతకం చేసినప్పటి నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు టీ20 వరల్డ్ కప్ జట్టులోని 15 మందిలో ఉండే స్థాయి ఆట చూపిస్తున్నాడు. నంబర్–3 స్థానానికి వెంకటేష్ అయ్యర్ లేదా రచిన్ రవీంద్ర రాజస్థాన్‌కు సరైన ఎంపికలు కావచ్చు అన్నారు.
అలాగే స్పిన్నర్ల విషయంలో మాట్లాడుతూ రవి బిష్ణోయ్, రాహుల్ చహార్ ఇద్దరిలో నేను చహార్‌కే ఓటేస్తాను. అతడు అద్భుతమైన లెగ్ స్పిన్నర్. బిష్ణోయ్‌ను నేను ఎంచుకోను, కానీ రాజస్థాన్ అతడిపై వెళ్లవచ్చు. మైకేల్ బ్రేస్‌వెల్ కూడా వారికి మంచి ఎంపిక. జడేజాకు తోడుగా రెండో స్పిన్నర్‌గా, నంబర్–8 స్థానంలో అతడు పర్ఫెక్ట్‌గా సరిపోతాడు అని తెలిపారు.
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) వేలం వ్యూహంపైనా శ్రీకాంత్ తన అభిప్రాయం వెల్లడించారు. నికోలస్ పూరన్ నంబర్–3లోనే బ్యాటింగ్ చేయాలి. అతడు నంబర్–5లో సరిపోడు. వారు వెంకటేష్ అయ్యర్‌ను తీసుకున్నా, అతడు నంబర్–4లో ఆడాలి. అప్పుడు రిషభ్ పంత్ నంబర్–5లో బ్యాటింగ్ చేయాలి. వారు రవి బిష్ణోయ్‌ను వదిలేశారు కాబట్టి, ఆ స్థానంలో రాహుల్ చహార్‌ను తీసుకోవచ్చు అన్నారు.
ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే డఫీ లేదా నోర్ట్జేపై వెళ్లవచ్చు… మ్యాట్ హెన్రీని కూడా ప్రయత్నించొచ్చు. లుంగి ఎన్‌గిడీ కూడా మంచి ఎంపిక. అతడు ఇప్పుడు మరింత మెరుగైన బౌలర్‌గా మారాడు, దాదాపు అన్ని జట్లు అతడిపై దృష్టి పెట్టొచ్చు అని శ్రీకాంత్ పేర్కొన్నారు.
Also Read:కాంగ్రెస్ గుండాగిరిపై కేటీఆర్ కన్నెర్ర..

