రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై, కేంద్రంలోని బీజేపీ వైఖరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ మెట్రో విస్తరణలో కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరిని ఎండగట్టడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా లోపాలను, మంత్రుల బాధ్యతారాహిత్యాన్ని ఆయన ఉదాహరణలతో సహా నిలదీశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని కేపీ వివేకానంద పేర్కొన్నారు. కేవలం 45 లక్షల జనాభా ఉన్న జైపూర్ నగరంలో మెట్రో ఫేజ్-2 పనులకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారని, అక్కడ పనులు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయని ఆయన గుర్తుచేశారు.
కానీ, దాదాపు 1.3 కోట్ల జనాభాతో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మెట్రో రెండో దశ అనుమతులు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు ఈ వివక్షపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎంత అస్తవ్యస్తంగా సాగుతుందో చెప్పడానికి ప్రభుత్వ జీవోలే నిదర్శనమని వివేకానంద మండిపడ్డారు. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఒక అధికారిక జీవో (GO) పైన ‘గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అని ముద్రించి రావడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ జీవో మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని వస్తుంటే.. సంబంధిత శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ఆయన నిద్రపోతున్నారా? ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఇంకోటి ఉండదు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఈ తప్పిదమే పరాకాష్ట అని దుయ్యబట్టారు.
రాష్ట్ర మంత్రుల బాధ్యతారాహిత్యం ఏ స్థాయిలో ఉందో వివరిస్తూ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీరును ఆయన తప్పుపట్టారు. ఒకవైపు ముఖ్యమంత్రి స్వయంగా టూరిజం శాఖ ప్రగతిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం (రివ్యూ) నిర్వహిస్తుంటే.. ఆ శాఖకు సంబంధించిన మంత్రి జూపల్లి మాత్రం స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని విమర్శించారు.

