దుర్గం చెరువు కబ్జా నిరాధారం..కక్షతోనే కేసు!

4
- Advertisement -

దుర్గం చెరువు ఆక్రమణ ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, రాజకీయ కక్షతోనే ఈ కేసులు పెట్టారని ఆయన స్పష్టం చేశారు. దుర్గం చెరువులో తాము ఐదు ఎకరాల భూమిని కబ్జా చేశామంటూ కేసు పెట్టారని, కానీ ఆ భూమిలో తమకే కాదు ప్రభుత్వానికి కూడా గజం స్థలం లేదని తెలిపారు. ఇది పూర్తిగా నిరాధార ఆరోపణ అని ఆయన కొట్టిపడేశారు.

దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో చాలాకాలంగా వాహనాల పార్కింగ్ జరుగుతోందని, అక్కడే ఖాళీ స్థలంలో చెత్తను కూడా డంప్ చేస్తారని చెప్పారు. అలాంటి సాధారణ విషయాలను ఆధారంగా చేసుకుని కావాలనే తనపై కేసు పెట్టారని ఆరోపించారు. నిజంగా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. తనపై వ్యక్తిగత కక్షతోనే ఈ వ్యవహారం నడుస్తోందని అన్నారు.

బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు కూడా అదే ప్రాంతంలో పక్కనే ఉన్నాయని పేర్కొన్నారు. దుర్గం చెరువులో తనకు ఎలాంటి భూమి లేదని, ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. రోడ్డు మీద లేదా చెట్ల కింద వాహనాలు పార్క్ చేసినందుకే కేసులు పెట్టారని మండిపడ్డారు.

హైడ్రా అధికారులకు పిర్యాదు వెళ్లిందని తమ సిబ్బంది ద్వారా ఫోన్ వచ్చిందని, తాను స్వయంగా వెళ్లి వివరణ ఇస్తానని చెప్పారు. కేసుపై న్యాయపరంగా పోరాడతామని, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. అక్కడ వాహనాల పార్కింగ్ చేయడం సహజమని అన్నారు. బేషరతుగా కేసును విత్‌డ్రా చేయకపోతే, ఎఫ్‌టీఎల్‌లో ఇళ్లు కట్టిన వారి ఇండ్ల ముందు ధర్నా చేస్తానని కొత్త ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.

Also Read:Akhil:లెనిన్ ఫస్ట్ సింగిల్!

 

- Advertisement -