మాటనిలబెట్టుకున్న కేసీఆర్‌..వీరికి బెర్త్ కన్ఫామ్‌

237
koppula
- Advertisement -

తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరికొద్దిగంటలు మాత్రమే మిగిలిఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్‌లో ఎవరికి బెర్త్ దక్కుతుందో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠనెలకొంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 9 లేదా 10 మందితో మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది.

మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే వారితో ఇప్పటికే సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ఫోన్ వచ్చిన నేతలు ఒక్కరొక్కరుగా ప్రగతిభవన్‌కు చేరుకుంటున్నారు. అంతా ఉహించినట్లే కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్‌కు బెర్త్‌ కన్ఫామ్ అయింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో వీరిద్దరు భేటీ అయ్యారు.

కొప్పులకు మంత్రిపదవిపై గతంలోనే కేసీఆర్ హామీ ఇచ్చారు. ధర్మపురిలో జరిగిన ఓ బహిరంగసభలో కొప్పులకు త్వరలో మంత్రిపదవి దక్కుతుందని చెప్పారు. దీంతో టీడీపీ నుండి టీఆర్ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు సైతం మంత్రిపదవి హామీ ఇచ్చారు. మాట ఇస్తే తప్పని కేసీఆర్ ఆ హామీని నిలబెట్టుకున్నారు.

ఉమ్మడివరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్‌ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీలో కార్యకర్త స్ధాయి నుండి అంచెలంచెలుగా ఎదిగిన ఎర్రబెల్లి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. ఓటమి ఎరుగని నేతగా పేరుతెచ్చుకున్న ఎర్రబెల్లి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఓ సారి ఎంపీగా గెలుపొందారు.

సింగరేణి కార్మికునిగా తన జీవితం ప్రారంభించిన కొప్పుల ఈశ్వర్‌ ఉద్యమసమయం నుండి కేసీఆర్ వెంటే నడిచారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేసిన కొప్పుల పార్టీకి విధేయుడిగా ఉన్నారు.వీరిద్దరికి మంత్రిపదవులు కన్ఫామ్ కావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

- Advertisement -