ద‌ళిత రైతుల‌కు పాడి పశువుల పంపిణీ: ‌మంత్రి కొప్పుల

257
Koppula Eshwar
- Advertisement -

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఎస్సీ కార్పొరేష‌న్ ద్వారా ద‌ళిత రైతుల‌కు పాడి పశువుల పంపిణీపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ స‌మాధానం ఇచ్చారు. ఎస్సీ కార్పొరేష‌న్ ద్వారా ఒక పైల‌ట్ ప్రాజెక్టుగా 10 జిల్లాల్లో ద‌ళిత‌ రైతుల‌కు పాడి ప‌శువుల‌ను పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. 60 శాతం సబ్సిడీతో బ‌ర్రెల‌ను పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు. 2018-19 సంవ‌త్స‌రం నుంచి ఈ ప‌థ‌కం కింద పాడి ప‌శువుల‌ పంపిణీ ప్రారంభించ‌బ‌డింద‌న్నారు.

సూర్యాపేట, వ‌రంగ‌ల్, ములుగు, జగిత్యాల‌, జ‌న‌గాం, కామారెడ్డి, మ‌హ‌బూబాబాద్‌, సిద్దిపేట‌, జోగులాంబ గ‌ద్వాల‌, పెద్ద‌ప‌ల్లి జిల్లాల్లో మినీ డైరీ ప‌థ‌కాన్ని చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. ఈ ప‌థ‌కం కింద ఇప్ప‌టికే 3,590 మంది రైతులు ల‌బ్ది పొందార‌ని మంత్రి తెలిపారు. ప్ర‌త్యేకంగా ఎస్సీ వ‌ర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు మినీ డైరీ ప్రాజెక్టు చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు.

ఒక్కో యూనిట్‌లో 4 బ‌ర్రెలు ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. వాటికి మూడు క్వింటాళ్ల దాణా ఇస్తున్నామ‌ని మంత్రి చెప్పారు. ఒక్కో బ‌ర్రెకు రూ. 4 వేలు క‌లెక్ట‌ర్ ద్వారా అందిస్తున్నామ‌ని తెలిపారు. అర్హుల‌ను చాలా పార‌ద‌ర్శ‌కంగా గుర్తించి బ‌ర్రెల పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ. ల‌క్షా 50 వేలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో రూ. 2 ల‌క్ష‌లు ఆదాయ ప‌రిమితిని విధించామ‌న్నారు. క‌నీసం 20 గుంట‌ల భూమి కూడా ఉండాల‌ని నిబంధ‌న విధించామ‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ తెలిపారు.

- Advertisement -