దేశంలో ఎక్కడాలేని విధంగా ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్స్ విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు కొప్పుల.
మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఐదు దేశాలకు(అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్) మాత్రమే ఈ పథకం వర్తించేదని ఇప్పుడు పది దేశాలకు విస్తరించామని చెప్పారు.
ఫ్రాన్స్, జర్మనీ, సౌత్‌కొరియా, జపాన్, న్యూజిలాండ్‌కు విస్తరించడం జరిగిందన్నారు. ఇందులో మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 230 కోట్ల 40 లక్షల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో 42 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. పథకంలో సంవత్సరానికి ఉన్న 500 కోటా నిండటం లేదని కాబట్టి కోటాను పెంచే ఆలోచన లేదని పేర్కొన్నారు.