సోమవారం పెద్దపెల్లి జిల్లా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ముత్తారం మండలం, ఖమ్మంపల్లి, అడవి శ్రీరాంపూర్, ఓడేడ్, ముత్తారం, మైదంబండ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 66 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించి,100 కోట్ల అంచనా వ్యయంతో చెక్ డ్యాం నిర్మాణానికి, శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ రోజు ఎవరెన్ని మాట్లాడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మన ప్రభుత్వం వచ్చి ఏడో సంవత్సరం నడుస్తున్నది. ఈ ఏడు సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఆలోచన చేసినా ఏ కార్యక్రమం తీసుకొచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ రైతాంగం కోసం సకలజనుల కోసం అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చిన విషయం అందరికీ తెలుసు అన్నారు.
ఒక మాటలో చెప్పాలంటే ఇది ఎంతో అనుభవంతో ప్రజల కష్టసుఖాలు తెలిసినటువంటి నాయకులకే ఇటువంటి కార్యక్రమాల అమలు చేయడం సాధ్యమవుతుంది అన్నారు. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రభుత్వాలు ఉండే.. దేశంలో అనేక ప్రభుత్వాలు ఉండే.. కానీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇక్కడ ఏ విధమైనటువంటి కష్టాలు నష్టాలు అనేక మైనటువంటి ఇబ్బందులు ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. అటువంటిది తక్కువ సమయమే అయినప్పటికీ అద్భుతమైనటువంటి విజయాలు సాధించిన ఘనత టిఆర్ఎస్ పార్టీ, మన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.
గత ప్రభుత్వ పాలనలో 65 ఏళ్లు ఎదురుచూసినా కాని కరెంట్ రాలేదు. కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 6 నెలల్లో కరెంట్ వచ్చింది. రెండేళ్లకు 24 గంటలు వచ్చింది.24 గంటలు ఉచిత కరెంటు.. ఉచితంగా వచ్చే కరెంటు కావచ్చు అని అనుకుంటారు. అట్ల కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ మా రైతు సోదరులు పక్షాన ప్రతి సంవత్సరం 10 వేల కోట్ల రూపాయలు చెల్లించి రైతులకు ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యమంత్రి ఒకటే మాట చెప్పారు.. రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని సంకల్పంతో వారు చేసిన ప్రయత్నం ఫలించింది. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ఎన్నిసార్లు ఎన్ని కార్యక్రమాల అమలు అవుతున్నాయి, అదేవిధంగా చదువుకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు. అనేక వర్గాలకు పెన్షన్లు ఇచ్చే విషయం కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడా కూడా అటువంటి పథకాలు ఏ రాష్ట్రంలో లేవు అని మంత్రి కొప్పుల పేర్కొన్నారు.