కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ గుడ్‌బై…?

420
konda surekha
- Advertisement -

తెలంగాణలో మరో ఆంధ్రా పార్టీ పురుడు పోసుకుంటోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమార్తె, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. అయితే షర్మిల పార్టీ ఏర్పాటు ప్రకటనతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. షర్మిల పార్టీ వెనుక ఉన్న బలమైన రాజకీయ శక్తి ఎవరో పైకి తెలియకపోయినా జాతీయ స్థాయిలో పెద్దల వ్యూహంలో భాగంగానే తెలంగాణలో షర్మిల పార్టీ తెర మీదకు రాబోతుందని తెలుస్తోంది. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకల్యాపాలను దాదాపుగా నిలిపివేసింది.

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సన్నిహితంగా ఉంటున్న వైఎస్ జగన్ ఏపీ ప్రయోజనాల కోసం తెలంగాణలో పార్టీ కార్యకలాపాలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. అయితే అన్నతో విబేధాల నేపథ్యంలో షర్మిల పార్టీ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అన్నపై కోపం ఉంటే ఏపీలో పార్టీ పెట్టాలి కాని..తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటని రాజకీయ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని వాదనలు వచ్చినా షర్మిల మాత్రం పార్టీ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారంట. నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడిన షర్మిల, వెంటనే ఖమ్మం జిల్లా నేతలతో కూడా సమావేశమవుతారని తెలుస్తోంది. తెలంగాణలో గతంలో వైఎస్‌ఆర్ కోసం పని చేసి రాష్ట్ర విభజన తర్వాత వివిధ పార్టీలలో చేరిన పాత నేతలను, వైఎస్ఆర్ అభిమానులకు షర్మిల ఫోన్ చేసి మరీ పార్టీలోకి రమ్మని ఆహ్వానం పలుకుతున్నారంట..ఈ కోవలో వైఎస్‌ఆర్‌‌కు వీర విధేయురాలైన కొండా సురేఖ షర్మిల పార్టీలో చేరుతుందా అనే అనుమానాలు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నాయంట.

వైఎస్‌ కుటుంబంతో కొండా సురేఖకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో కొండా సురేఖను, ఆమె భర్త కొండా మురళీని వైఎస్ రాజకీయంగా ప్రోత్సాహించారు. వైఎస్ కేబినెట్‌లో కొండా సురేఖ మంత్రిగా కూడా పని చేశారు. వైఎస్ మరణం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి మరీ కొండా సురేఖ వైఎస్ జగన్‌కు అండగా నిలబడింది. జగన్ కూడా మొదట్లో కొండా దంపతులకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం పీక్స్‌లో ఉన్న టైమ్‌లో జగన్ సమైక్యాంధ్రకు జై కొట్టాడు. దీంతో యావత్ తెలంగాణ సమాజంలో జగన్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో వరంగల్ జిల్లాలో పర్యటించేందుకు రైలులో బయలుదేరిన జగన్‌ను మానుకోట రైల్వే స్టేషన్‌లో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆ సందర్భంగా కొండా సురేఖ, ఆమె అనుచరులు, తెలంగాణ ఉద్యమకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు రాళ్లు వేసుకున్నారు. ఆంధ్రా నేత జగన్‌కు మద్దతుగా కొండా సురేఖ స్వయంగా తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు విసిరే సీన్‌ను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు.

ఇక రాష్ట్ర విభజన తర్వాత జగన్‌కు, కొండా సురేఖకు మధ్య మనస్పర్థలు రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన కొండా సురేఖకు , కొండా మురళీకి కేసీఆర్ మంచి ప్రియారిటీనే ఇఛ్చారు. అయితే వరంగల్‌ జిల్లాలో వర్గ విబేధాలు రగిలిస్తూ…పార్టీలో గ్రూపు రాజకీయాలకు పాల్పడుతుందని కొండా సురేఖపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కొండా ఫ్యామిలీ గులాబీ గూటిని వదిలి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎక్కువై పోవడంతో కొండా ఫ్యామిలీని పట్టించుకున్నవారే లేరు. ఈ పరిస్థితులలో షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ నుంచి కొండా సురేఖకు ఆహ్వానం రావడం ఖాయమని వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో చర్చ జరుగుతుందంట. షర్మిల తన తండ్రికి సన్నిహితులైన నాయకులందరికీ ఫోన్లు చేసి పార్టీలోకి ఆహ్వానిస్తోంది. అదే కోవలో తన తండ్రికి సన్నిహితురాలైన కొండా సురేఖను, ఆమె భర్త కొండా మురళీకి కూడా షర్మిల ఫోన్ చేసి మరీ పార్టీలో చేరమని కోరే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే కొండా ఫ్యామిలీ మళ్లీ కాంగ్రెస్‌ను వీడి, షర్మిల పార్టీలో చేరడం ఖాయమని వరంగల్ జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి షర్మిల కొండా దంపతులు షర్మిల పార్టీలో చేరుతారా లేదా అనేది చూడాలి.

- Advertisement -