కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి..

499
konda laxman bapuji

నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, స్వాతంత్ర పోరాటం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండాలక్ష్మణ్‌ బాపూజీ.ఆయన 104వ జయంతి వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి గంగుల కమలాకర్,మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్,ఎంబిసి చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బిసి సంఘాల నాయకులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

న్యూ ఢిల్లీలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఘన నివాళి అర్పించారు. తెలంగాణ భవన్ లో లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబరు 27న జన్మించిన కొండా లక్ష్మణ్‌ న్యాయవాద విద్యను అభ్యసించారు. నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ విముక్తి పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. 1947లో కింగ్‌కోఠి నుంచి బయటకు వచ్చిన నిజాం నవాబుపై బాంబులు విసిరిన సంఘటనలో నిందితుడిగా ఉన్నారు. 97 ఏళ్ల వయసులో 2012 సెప్టెంబరు 21న ఆయన కన్నుమూశారు.

1969 తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కోరిక మేరకు మంత్రి పదవికి రాజీనామా చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మర్రి చెన్నారెడ్డితోనూ విభేదించారు. తెలంగాణ కోసం ఉద్యమించి, ఉద్యమకారులతో ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష, ఢిల్లీలో చలిని లెక్క చేయకుండా జంతర్‌మంతర్‌లో దీక్ష చేయటం ఆయన పోరాట స్ఫూర్తికి నిదర్శనం.