జయహో కేసీఆర్: కోలేటి దామోదర్

391
koleti damodhar
- Advertisement -

పూర్వం ఎప్పుడో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, టంగుటూరి ప్రకాశం పంతులు, జ్యోతిబసు వంటి మహానాయకులు ప్రజాభిమానాన్ని అమితంగా చూరగొన్నారని, వారు ఎక్కడికెళ్ళినా ప్రజలు నీరాజనాలు పట్టేవారని, ఎన్నికలలో వారికి ఎప్పుడూ ఎదురులేదని మనకు తెలుసన్నారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్‌. ఆ విధంగా ప్రజాభిమానాన్ని చూరగొన్న మహానాయకుల కోవకు చెందిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు.

1999వ సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తరువాత ఏ ఎన్నికలలోనూ ఆయనకు తిరుగులేదు. ఉద్యమం ప్రథమ దశలో ఉన్నప్పుడే కాంగ్రెస్ నాయకుడు కరీంనగర్ జిల్లాకే చెందిన ఎం. సత్యనారాయణ రావు చేతనైతే నాతో పోటీ చేసి గెలవము” ని శ్రీ కేసిఆర్ కు యాదృచ్చికంగా ఒక సవాలు విసిరితే దాన్ని సీరియస్ గా తీసుకుని, కేసిఆర్ తమ ఎంపి పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగారు. దీనితో అప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం హడలిపోయింది. ఇటువంటి పిచ్చి సవాలు విసిరినందుకు కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ రావు ని మందలించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆ ఎన్నిక మొదలుకొని కేసిఆర్ ఎన్నిసార్లు రాజీనామా చేశారో, ఎన్నికలలో పోటీ చేసి మళ్ళీ గెలిచారో అందరికీ తెలిసిన విషయమే. ఆయనే కాకుండా ఆయన పార్టీ మంత్రులను, ఎంఎఱ లను కూడా ఎన్నో సార్లు రాజీనామా చేయించి, మళ్ళీ గెలిపించుకున్న ఘనత కేసిఆర్ ది అన్నారు.

ఉద్యమ సమయంలో పదవులకు రాజీనామాలు చేసి, ఎన్నికల బరిలోకి దిగి, మళ్ళీ తిరిగి గెలవడం అన్నది కేసిఆర్ గారి నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది. అదీ ఒకసారి కాదు – ప్రజలలో వున్న తెలంగాణ సెంటిమెంట్ ను చాటడానికి ఎన్ని సార్లు అవసరమోస్తే అన్ని సార్లు పదవులకు రాజీనామాలు చేసి, అప్పుడు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీని ఎదిరించి, తిరిగి గెలిచిన చరిత్ర టిఆర్ఎస్ నాయకులది.

2014 ఎన్నికలలో కేసిఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. ఆ తరువాత జరిగిన అన్ని స్థానిక ఎన్నికలలోనూ,జిల్లా పరిషత్ ఎన్నికలలోనూ, సహకార సంఘాల ఎన్నికలలోనూ టిఆర్ఎస్ పార్టీదే పైచేయి అయింది. నూటికి నూరు శాతం జిల్లా పరిషత్తులను టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ తరువాత అసెంబ్లీకి, పార్లమెంట్ కు జరిగిన అన్ని ఉపఎన్నికలలోనూ టిఆర్ఎస్ పార్టీయే విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ 99 స్థానాలు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఈ

విధంగా ఏకపక్షంగా ప్రజలు ఒక పార్టీని గెలిపించిన సంఘటన అంతవరకూ జరగలేదు. 2018 సెప్టెంబర్ లో కేసిఆర్ గారు అర్ధాంతరంగా శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు దిగితే, ఇదొక పెద్ద దుస్సాహసమని ఎందరో అన్నారు. పోయినసారంటే ప్రత్యేక తెలంగాణ వేవ్ తో గెలిచారు. ఈసారి కాంగ్రెస్ ను, బిజెపిని తట్టుకుని గెలవడం కష్టమని ఎందరో అభిప్రాయపడ్డారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ, టిడిపి పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేశారు. ఒక పక్క దేశమంతటా మోదీ ప్రభావం అధికంగా వుంది. ఈ పరిస్థితులలో అర్ధాంతరంగా ఎన్నికలకు దిగడం తెలివైన పని కాదన్నారు. ఒక స్థాయిలో ఎన్నికలలో పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థులలో కూడా గుబులు ఏర్పడింది.

అయితే అందరి ఆలోచనలు పటాపంచలు చేస్తూ, కేసిఆర్ గారు గొప్ప వ్యూహరచనతో 2018 అసెంబ్లీ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ పార్టీకి అఖండ విజయం చేకూర్చిపెట్టారు. అనితరసాధ్యమైన ఆయన రాజకీయ చతురతకు ఈ ఎన్నికలు ఒక గీటురాయి. ఆ తరువాత 2019 ఏప్రిల్ – మే లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఈ విజయపరంపర కొనసాగింది.

అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పంచాయితీ ఎన్నికలు,జిల్లా పరిషత్ ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికలు, సహకార సంస్థల ఎన్నికలు – మొదలైన అన్ని ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ విజయపథాన దూసుకుపోతున్నది. రాష్ట్రంలో ప్రతిపక్షం, ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి, నామమాత్రావశిష్టంగా మిగిలిపోయింది.

దేశరాజకీయ చరిత్రలోనే ఇదొక అపూర్వమైన అద్భుత సంఘటన. స్వాతంత్ర్యం వచ్చిన పిమ్మట ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ, ఏ పార్టీకి ప్రజలు ఇంతటి అఖండ విజయాన్ని అందివ్వలేదు. ఇది కేసిఆర్ గారి పట్ల ప్రజలకు గల అభిమానం వల్ల మాత్రమే సాధ్యమైంది. కేసిఆర్ గారు ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల వంటి భారీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ఆయన ప్రజలకందిస్తున్న రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి, కేసిఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు ప్రజా బాహుళ్యంలోకి ఎంతగా చొచ్చుకుపోయి, కేసిఆర్ గారికి వారి హృదయాలలో ఎంతటి సుస్థిర స్థానాన్ని ఇచ్చాయి అనడానికి ఈ ఎన్నికలు నిదర్శనం.ఇప్పుడు దేశంలోని రాజకీయ నాయకులందరూ తెలంగాణ రాష్ట్రం వైపు, కేసిఆర్ గారి వైపు చూస్తున్నారు. ఇంతటి అపూర్వ విజయపరంపర టిఆర్ఎస్ పార్టీకి, కేసిఆర్ గారికి ఎట్లా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారు. అన్ని రాష్ట్రాలలోనూ అన్నో ఇన్నో సంక్షేమ పథకాలు అమలు జరుగుతూనే వుంటాయి. అయితే కేసిఆర్ గారి వలె పక్కా ప్రణాళికతో, నిధులు ఎక్కడా దుర్వినియోగం కాకుండా సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజలకు అందే కార్యక్రమాలు మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన పిమ్మట, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నంత నిర్దుష్టంగా ఎక్కడా జరగలేదని చెప్పడం అతిశయోక్తి కాదు. కేసిఆర్ గారి నిజాయితి, చిత్తశుద్ధి, ప్రజా సంక్షేమం పట్ల ఆయనకు గల అకుంఠిత దీక్ష, నిరంతర కృషి, జాతి, మత తారతమ్యం లేకుండా అందర్నీ కలుపుకుపోయే తత్త్వం, తెలంగాణ రాష్ట్రాన్ని విజయపథాన నడిపించడమే కాక, రాష్ట్రం “బంగారు తెలంగాణ” అయ్యే సమయం అతిత్వరలోనే ఉందన్నారు.

- Advertisement -