ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌మ్యాచ్‌లో భారత్ భారీస్కోరు సాధిస్తోంది. రెండోరోజు 356/3 స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు కోహ్లి-రహానే జోడి మంచి భాగస్వామ్యాన్ని అందించింది. ఇక తొలిరోజు ఆటలో బంగ్లాపై సెంచరీ సాధించడం ద్వారా ప్రతీ టెస్టు హోదా కలిగిన దేశంపై సెంచరీలు సాధించిన ఘనతను సొంతం చేసుకున్న కోహ్లి మరో అరుదైన ఫిట్ అందుకున్నాడు.
ఇక రెండోరోజు అదే జోరు కంటిన్యూ చేసిన కోహ్లి బంగ్లా బౌలర్లను చీల్చి చెండాడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ డబుల్ సెంచరీ చేసి 204 పరుగుల వద్ద వెనుదిరిగాడు. క్రికెట్ చరిత్రలో వరుసగా నాలుగు సిరీస్ లలో నాలుగు డబుల్ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్ మన్ గా విరాట్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో బ్రాడ్ మన్, ద్రవిడ్ లాంటి దిగ్గజాలను విరాట్ అధిగమించాడు. గతేడాది వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ లతో సిరీస్ లలోనూ విరాట్ డబుల్ సెంచరీలు చేశాడు. గతంలో బ్రాడ్ మన్, ద్రవిడ్ వరుసగా మూడు సిరీస్ లలో మూడు డబుల్ సెంచరీలు చేశారు.
ఇక ఒక స్వదేశీ సీజన్ లో అత్యధిక టెస్టు పరుగులు నమోదు చేసిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు కోహ్లి. తద్వారా భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్(1105) రికార్డును కోహ్లి చెరిపేశాడు. 2004-05 సీజన్ లో సెహ్వాగ్ ఈ అరుదైన మార్కును చేరగా, దాదాపు 13 ఏళ్ల తరువాత ఆ రికార్డును కోహ్లి బద్ధలు కొట్టాడు. 2016-17 సీజన్లో 15 టెస్టులాడిన కోహ్లీ 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో తొలి స్థానంలో నిలిచాడు.
గతంలో గౌతమ్ గంభీర్(1,269), ద్రవిడ్(1,241, 1,006), మోహిందర్ అమర్‌నాథ్(1,182), సునీల్ గావస్కర్(1,179, 1,027), వీరేంద్ర సెహ్వాగ్(1,128, 1,079) ఒకే సీజన్‌లో వెయ్యికి పైగా పరుగులు తీసిన వారిలో ఉన్నారు.
అలాగే కెప్టెన్‌గా 2016-17సీజన్‌లో వెయ్యి పరుగులు చేసిన అంతర్జాతీయ ఆటగాళ్లలో కోహ్లీ 7వ వాడు. అంతకుముందు రికీ పాంటింగ్(1,483), లారా(1,253), క్లార్క్(1,178, 1,141) గ్రేమ్ స్మిత్(1,107) గ్రహమ్ గూచ్(1,058), బాబ్ సిమ్సన్(1,007) ఒకే సీజన్‌లో వెయ్యికి పైగా పరుగులు చేసిన వారిలో ఉన్నారు.