తొలిరోజు ‘టీమిండియా’దే

225
- Advertisement -

ఇండోర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడోటెస్టు తొలిరోజు భారత్‌ పై చేయి సాధించింది. కోహ్లి,రహానే రాణించడంతో భారత్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (103 నాటౌట్‌: 191 బంతుల్లో 10×4) అజేయ శతకం బాదడంతో శనివారం ఆట ముగిసే సమయానికి భారత్‌ 3 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. టెస్టుల్లో కోహ్లికి ఇది 14వ సెంచరీ. కోహ్లితో పాటు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అజింక్య రహానె (79 నాటౌట్‌: 172 బంతుల్లో 9×4) అజేయ అర్ధశతకంతో క్రీజులో నిలిచాడు. 54 ఓవర్ల పాటు కివీస్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడి నాలుగో వికెట్‌కి అజేయంగా 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను మెరుగైన స్థితిలో నిలిపింది.

kohli

తొలుత టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్‌ మురళీ విజయ్‌ (10) జట్టు స్కోరు 26 పరుగుల వద్దే ఔటై నిరాశపరిచినా.. రెండేళ్ల తర్వాత టీమిండియాలో చోటు సంపాదించిన వెటరన్‌ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ (29: 53 బంతుల్లో 3×4, 2×6) దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. పుజారా(41: 108 బంతుల్లో 6×4)తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకుని ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. అయితే స్పిన్నర్‌ శాంట్నర్‌ విసిరిన వైవిధ్యమైన బంతిని అడ్డుకోలేకపోయిన పుజారా క్లీన్‌ బౌల్డవగా.. అనంతరం వచ్చిన రహానెతో కలిసి కోహ్లి భారత్‌ను పటిష్ఠ స్థితిలో నిలిపాడు. ఇప్పటికే తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Virat

Kohli

- Advertisement -