అది ఆయన ఇష్టం..!

201
Kohli
- Advertisement -

అనిల్ భాయ్ తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారని… దానిని తాను గౌరవిస్తున్నానని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన అనిల్ కుంబ్లే వ్యవహారంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి నోరు విప్పాడు. వెస్టిండీస్‌తో నేటి నుండి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కరేబియన్ గడ్డపై కోహ్లీ మాట్లాడుతూ కోచ్ పదవి నుంచి అనిల్ భాయ్ తప్పుకోవాలనుకోవడం.. ఆయన అభిప్రాయమని, దానిని తాను గౌరవిస్తున్నానని పేర్కొన్నాడు.

కుంబ్లే రాజీనామా వెనకున్న కారణం గురించి చెప్పేందుకు ఇష్టపడని కోహ్లీ.. ఈ విషయంలో డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధం లేని వ్యక్తులు ఎన్నో ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బయట ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయని అసహనం వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందన్నది పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని పేర్కొన్నాడు. అక్కడేం జరిగిందన్న విషయాన్ని తాను బయటకు వెల్లడించలేనని తేల్చి చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్ పవిత్రను తానెప్పుడూ అగౌరవ పరచలేదని కోహ్లీ తెలిపాడు. కాగా, టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ.. మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే మధ్య అభిప్రాయభేదాలు ఎప్పట్నుంచి, ఎలా తలెత్తాయో ఎవరి వద్దా విశ్వసనీయ, కచ్చితమైన సమాచారం లేదు! ఐతే వీరిమధ్య తలెత్తిన విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

మరోవైపు వెస్టిండీస్ టూర్‌లో ఉన్న‌ విరాట్ కోహ్లి తీవ్ర ఒత్తిడిలో ఉన్న‌ట్లు టీమ్ మేనేజ్‌మెంట్‌లోని అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. కోచ్ విష‌యంలో కోహ్లికే వీటో ప‌వ‌ర్ ఇచ్చారు. అది కుంబ్లే రాజీనామాకు దారి తీసింది. ఇప్పుడు కెప్టెన్‌గా అత‌ను క‌చ్చితంగా మంచి ఫ‌లితాలు సాధించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఇదే విరాట్‌పై ఒత్తిడి పెంచుతున్న‌దని ఆ అధికారి తెలిపారు. ఇక విండీస్‌లో భారత్‌ ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడనుంది.

- Advertisement -