వరల్డ్ నంబర్ వన్.. విరాట్‌ కోహ్లీ..

178

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో భారత్‌ పరాజయం చావిచూసిన సంగతి తెలిసిందే. కానీ భారత జట్టు సారథి విరాట్‌ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రదర్శనే కోహ్లీని నంబర్‌ 1 టెస్టు బ్యాట్స్‌మెన్‌గా నిలబెట్టింది. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అటగాడు స్టీవ్‌ స్మిత్‌ను దాటేసి కోహ్లీ తొలి స్థానాన్ని అధిరోహించాడు. టెస్టుల్లో నంబర్‌వన్‌ స్థానానికి చేరుకోవడం కోహ్లీ కెరీర్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం.

Kohli is on the top of the World-No1

సచిన్ టెండూల్కర్ తర్వాత టెస్టుల్లో నంబర్ వన్ అయిన తొలి టీమిండియా బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి కావడం మరో విశేషం. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 149, 51 పరుగులు చేసిన విరాట్.. 31 పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 32 నెలలుగా నంబర్ వన్ స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్‌ను మించిపోయాడు. ఇప్పటివరకు విరాట్ 67 టెస్టులు ఆడాడు.

ప్రస్తుతం స్మిత్ కంటే ఐదు పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. తన ర్యాంకును నిలుపుకోవాలంటే సిరీస్ మొత్తం తన ఫామ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. తొలి టెస్ట్‌కు ముందు కోహ్లి ఖాతాలో 903 పాయింట్లు ఉన్నాయి. టీమిండియా ఆల్‌టైమ్ హైయెస్ట్ సునీల్ గవాస్కర్ కంటే 13 పాయింట్లు వెనుకబడి ఉండగా.. ఇప్పుడతని కంటే 18 పాయింట్లు ఎక్కువగా సాధించాడు. కోహ్లి కాకుండా టెస్టుల్లో సచిన్, ద్రవిడ్, గంభీర్, గవాస్కర్, సెహ్వాగ్, వెంగ్‌సర్కార్ నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నవాళ్లలో ఉన్నారు. కోహ్లి వన్డేల్లోనూ నంబర్ వన్ కావడం విశేషం.