టీమిండియా కొత్త కోచ్ ఎవరనేది తేలడానికి మరికొద్ది రోజులు ఆగాల్సిందే. సోమవారం సాయంత్రంలోపు కోచ్ ఎవరో చెబుతామన్న బీసీసీఐ పెద్దలు మాట మార్చారు. టీమిండియా కెప్టెన్ కోహ్లిని సంప్రదించాకే కొత్త కోచ్ ఎవరో ప్రకటిస్తామని క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు గంగూలీ తెలిపారు. ఇవాళ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న ఐదుగురిని సీఏసీ ఇంటర్వ్యూ చేసింది. రవిశాస్త్రితోపాటు సెహ్వాగ్, టామ్ మూడీ, రిచర్డ్ పైబస్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లను ఇంటర్వ్యూ చేశామని గంగూలీ తెలిపారు. పానెల్‌లో గంగూలీ, లక్ష్మణ్ ఉండగా.. విదేశాల్లో ఉన్న సచిన్ స్కైప్ ద్వారా ఈ ప్రక్రియలో పాల్గొన్నాడు.
అందుబాటులో లేకపోవడంతో విండీస్ దిగ్గజం సిమన్స్‌ను ఇంటర్వ్యూ చేయలేదన్నారు. కోచ్‌ను నిర్ణయించే ముందు సారథి కోహ్లీని సంప్రదించామని గంగూలీ తెలిపారు. ఐతే విరాట్ ఇప్పటి వరకూ ఇంకా ఎవరి పేరూ సూచించలేదని సమాచారం. ఈ రేసులో రవిశాస్త్రి ముందంజంలో ఉన్నట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
దీంతో టీమిండియా కొత్త హెడ్ కోచ్ ఎవరో తెలుతుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది.