మరికొద్ది రోజుల్లో రానున్న కోహెడ ఫ్రూట్ మార్కెట్ ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ నేడు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం కొత్తపేటలో ఉన్న ఫ్రూట్ మార్కెట్ ను ఈనెల 27 వ తేదీన కోహెడలో ఉన్న 178 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కోహెడ మార్కెట్ కు ప్రతిరోజూ మామిడి కాయలను తెచ్చే కనీసం యాభైకి పైగా లారీలు వచ్చే అవకాశం ఉందని, వాటితోపాటు వచ్చే రైతులకు, కొనుగోలుదారులకు, వ్యాపారులకు, సాధారణ ప్రజానీకానికి కనీస సౌకర్యాలు కల్పించే పనులన్నింటిని వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
1986 లో కొత్తపేటలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఫ్రూట్ మార్కెట్ను ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్ చుట్టూ కాలనీలు, నివాస భవనాలు, వ్యాపార సముదాయాలు వచ్చి పూర్తిగా ట్రాఫిక్ మయం కావడంతో ఇక్కడి నుండి మార్కెట్‌ను తరలించాలని నిర్ణయించారు. కొత్తపేట మార్కెట్ ను కోహెడకు తరలించేందుకు నేటి నుండి మూడు రోజులపాటు సెలవులు కూడా ప్రకటించారు. కాగా, మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న కోహెడ మార్కెట్ యార్డ్ ను నేడు అడిషనల్ కలెక్టర్ హరీష్ తో కలసి కలెక్టర్ అమయ్ కుమార్ పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.