ఐపీఎల్ 13వ సీజన్‌లో రాజస్ధాన్ రాయల్స్ తొలి ఓటమిని చవిచూసింది. గత మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్ధాయిలో చేజింగ్ చేసిన రాజస్ధాన్ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. కేకేఆర్ విధించిన 175 పరుగుల లక్ష్య చేధనలో 9 వికెట్లు కొల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది.దీంతో 37 పరుగుల తేడాతో కోల్ కతా విజయం సాధించింది. ఇన్నింగ్స్ చివరలో టామ్ కుర్రాన్ సిక్స్‌లతో మెరుపులు మెరిపించిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కుర్రాన్ 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కోల్ కతా బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది.కెప్టెన్ స్మిత్ (3), సామ్సన్(8),రాబిన్ ఉతప్ప(2),పరాగ్(1),రాహుల్ తెవాటియా(14),బట్లర్(21) పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టారు.దీంతో 11 ఓవర్లలో 66 పరుగులు చేసి ఆరు వికెట్లు కొల్పోయింది. కేకేఆర్ బౌలర్లలో మావి 2,నగర్ కోటి 2,వరుణ్ చక్రవర్తి 2,కమిన్స్ 1,నరైన్ 1 వికెట్ తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 174 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (47: 34 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్), ఇయాన్ మోర్గాన్(34 నాటౌట్: 23 బంతుల్లో ఫోర్, 2సిక్సర్లు),సునీల్ నరైన్(15),ఆండ్రూ రస్సెల్ (24) పరుగులు చేశారు. స్టార్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ (2/18) అత్యద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు.