కొనసాగుతున్న రైడర్స్‌ జోరు..

146
- Advertisement -

ఐపీఎల్‌ పదో సీజన్‌లో బుధవారం రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. రాబిన్‌ ఉతప్ప(87: 47బంతుల్లో 7×4, 6×6), గౌతమ్‌ గంభీర్‌(62:46బంతుల్లో 6×4, 1×6) విజృంభించిన వేళ కోల్‌కతా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన కోల్‌కతా 20 స్కోర్‌ వద్ద ఓపెనర్‌ నరైన్‌(16: 11బంతుల్లో 3×4) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉతప్ప, గంభీర్‌ ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తొలి ఆరు ఓవర్లకు స్కోరు45/1 చేసింది. 7వ ఓవర్‌లో ఉతప్ప భారీ షాట్‌ ఆడగా బౌండరీ లైన్‌ వద్ద ఉనద్కత్‌ క్యాచ్‌ను జారవిడిచాడు. అటు గంభీర్‌, ఇటు ఉతప్ప ఇద్దరూ పుణె బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఫోర్లు, సిక్సర్లు బాదుతూ లక్ష్యానికి చేరువగా వచ్చారు. ఇన్నింగ్స్‌లో గంభీర్‌, ఉతప్ప రెండో వికెట్‌కు 158 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో ఉతప్ప, గంభీర్‌ ఔటైనప్పటికీ క్రీజులో ఉన్న బ్రావో, మనీశ్‌ పాండే 11 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్‌ను ముగించి కోల్‌కతాకు విజయాన్ని అందించారు.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పుణె బ్యాట్స్‌మెన్లు స్టీవ్‌ స్మిత్‌(51), రహానె(46) రాణించడంతో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి(38: 23 బంతుల్లో 7×4) ఆరంభం నుంచి ధాటిగా ఆడుతూ వచ్చాడు. అతనికి మరో ఓపెనర్‌ రహానె సహకారం అందించడంతో భారీ షాట్లతో చెలరేగుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచుతూవచ్చాడు. పియూశ్‌ చావ్లా వేసిన 8వ ఓవర్‌ చివరి బంతిని వికెట్ల మీదికి ఆడుకొని త్రిపాఠి వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన స్టీవ్‌ స్మిత్‌ మిగతా బ్యాట్స్‌మెన్లతో కలిసి భారీ స్కోరు చేసేందుకు శ్రమించాడు. ఈ క్రమంలో రహానె(46) నరైన్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనీ (11 బంతుల్లో 23 పరుగులు) కుల్దీప్‌ యాదవ్‌ వేసిన 18వ ఓవర్లో ధోనీతో పాటు మనోజ్‌ తివారీని కోల్‌కతా వికెట్‌ కీపర్‌ ఉతప్ప స్టంపౌట్‌ చేసి పెవిలియన్‌ పంపాడు. చివరి వరకు స్మిత్‌ పోరాడటంతో కోల్‌కతాకు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. యువ స్పిన్నర్‌ కుల్దీప్‌ రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. ఉమేశ్‌ యాదవ్‌, నరైన్‌, చావ్లా తలో వికెట్‌ తీశారు.

- Advertisement -