గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డా కె కేశవ రావు సోమవారం (14 th అక్టోబర్ ,2019 ) హైదరాబాద్‌లో ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందలోని ప్రధానాంశాలు ఇవే.
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు నన్ను బాధించాయి. ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం చూపజాలదు. పరిస్థితులు చేయి దాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింప జేసి చర్చలకు సిద్ధం కావాలి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గతం లో గొప్పగా పరిష్కరించింది.44 శాతం ఫిట్ మెంట్ ,16 శాతం ఐ ఆర్ ఇచ్చిన ఘనత టీఆరెఎస్ ప్రభుత్వానిదే. ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవలే తేల్చిచెప్పారు. అందుకు ఆయనను అభినందిస్తున్నా. అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజి క్యారేజీల విషయంలో కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలి.
నేను 2018 అసెంబ్లీ ఎన్నికల టిఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నాను.ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రతిపాదనేది మా ఎన్నికల ప్రణాళికలో చేర్చలేదు.ఆర్టీసీ యే కాదు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని మేనిఫెస్టోలో పేర్కొనలేదు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే విధానాన్ని (పాలసీ )మార్చుకోవాలని కోరడమే.ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయం.