తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన నివేదికపై ప్రభుత్వ వర్గాల్లోనే విభేదాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నివేదికపై ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కమిటీ చైర్మన్ కే కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి కొన్ని అంశాల్లో తన పరిధిని దాటి వ్యవహరించారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని ఆకునూరి మురళి వ్యాఖ్యానించడం సరైంది కాదని కేశవరావు పేర్కొన్నారు. ఆ అంశాన్ని నివేదికలో ప్రస్తావించకుండా ఉండాల్సిందని అన్నారు. టీచర్ల వేతనాలపై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమే గానీ, ప్రభుత్వానికి వాటితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
అలాగే విద్యా కమిషన్ నివేదికలో ఉన్న సిఫార్సులపై కూడా అనేక అభ్యంతరాలు ఉన్నాయని కేశవరావు తెలిపారు. కమిషన్ చేసిన సూచనలపై తనకూ అనేక సందేహాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూడా నివేదికలో ప్రస్తావించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఆ పథకం జోలికి వెళ్లకుండా ఉండాల్సిందని ఆయన అన్నారు.
విద్యా కమిషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలా లేదా అన్న విషయంపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని కేశవరావు తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Also Read:రష్యా చమురు కొనుగోలు…భారత్‌కు మినహాయింపు

