చలికాలం నిశ్శబ్దంగా కిడ్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నీటి తీసుకునే పరిమాణం తగ్గడం, రక్తపోటు పెరగడం, శారీరక చలనం తగ్గిపోవడం వంటి అంశాలు కిడ్నీలపై భారం పెడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్, హైబీపీ, ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఈ కాలం కిడ్నీలకు మరింత పరీక్షగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏషియన్ హాస్పిటల్‌లో కిడ్నీ వ్యాధులు, ట్రాన్స్‌ప్లాంట్ విభాగం డైరెక్టర్ & హెడ్ డాక్టర్ సాగర్ గుప్తా ప్రకారం, చలికాలంలో జీవనశైలిలో జరిగే మార్పులు చాలాసార్లు గమనించబడవు. అవి నెమ్మదిగా కిడ్నీ పనితీరును దెబ్బతీస్తాయి. చలికాలంలో ఎక్కువ మంది చేసే పెద్ద తప్పు తక్కువ నీరు తాగడమే అని నిపుణులు చెబుతున్నారు. చెమట తక్కువగా రావడం, దాహం వేయకపోవడం వల్ల శరీరానికి తక్కువ నీరు సరిపోతుందనుకుంటారు. కానీ విషపదార్థాలను బయటకు పంపాలంటే కిడ్నీలకు ఏడాది పొడవునా సరిపడా నీరు అవసరం. నీటి లోపం వల్ల రక్తం మందంగా మారడం, మూత్ర పరిమాణం తగ్గడం, కిడ్నీ ఫిల్ట్రేషన్ నెమ్మదించడం జరుగుతుంది. ముఖ్యంగా వృద్ధులు, డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు.
చలివాతావరణంలో రక్తనాళాలు సంకోచించడంతో రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. చలికాలంలో బీపీ చెక్ చేయడాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. నియంత్రణలో లేని రక్తపోటు కిడ్నీ నష్టానికి ప్రధాన కారణాల్లో ఒకటి అని చెబుతున్నారు. చలికాలంలో కదలికలు తగ్గిపోవడం వల్ల బరువు పెరగడం, షుగర్ లెవెల్స్ పెరగడం, బీపీ అదుపు తప్పడం జరుగుతుంది. ఇవన్నీ కిడ్నీలకు హానికరం. జిమ్ అవసరం లేదు – ఇంట్లోనే స్ట్రెచింగ్, యోగా లేదా చిన్న వ్యాయామాలు కూడా చాలవచ్చు.
చలికాలంలో వేయించిన పదార్థాలు, ప్యాకెట్ ఫుడ్స్, అచ్చార్లు, ఉప్పు ఎక్కువగా ఉండే సూపులు ఎక్కువగా తింటారు. అధిక సోడియం వల్ల కిడ్నీలు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది, బీపీ కూడా పెరుగుతుంది. కిడ్నీ వ్యాధులు, డయాబెటిస్, హైబీపీ ఉన్నవారు చలికాలంలో ఉప్పు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తున్నారు.
చలికాలంలో కీళ్ల నొప్పులు, శరీర నొప్పులు సాధారణం. అందుకే చాలామంది వైద్యుల సలహా లేకుండా నొప్పి మందులు వాడుతారు. ఇవి ఎక్కువకాలం వాడితే, ముఖ్యంగా నీటి లోపం ఉన్నప్పుడు, కిడ్నీలకు హాని చేస్తాయి.నొప్పి మందులు స్వయంగా ఎక్కువకాలం వాడకూడదు. కిడ్నీ సమస్యలు ఉంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి అని హెచ్చరిస్తున్నారు.
రెగ్యులర్ చెకప్‌లను వాయిదా వేయొద్దు.బీపీ, బ్లడ్ షుగర్, కిడ్నీ ఫంక్షన్ టెస్టులు ముందే సమస్యను గుర్తించడంలో సహాయపడతాయి. రోజూ కొంచెం కదలిక, రెగ్యులర్ ఫాలోఅప్స్ కిడ్నీ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి అని చెబుతున్నారు.
Also Read:అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రశ్నాపత్రం లీక్!

