‘ఖిలాడి’ మూవీ రివ్యూ..

396
- Advertisement -

మాస్ రాజా రవితేజ తాజాగా నటించిన చిత్రం ‘ఖిలాడి’. ఈమూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రమేశ్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి హీరోయిన్లు. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడ్డాక ప్రమోషన్ల స్పీడు పెంచి సినిమాకు హైప్‌ తెచ్చింది చిత్రయూనిట్‌. మరి ఈ సినిమా ఈమేరకు ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం.

కథ: గాంధీ (రవితేజ) ఒక అనాథ. అతణ్ని పెంచి పెద్ద చేసిన రాజశేఖర్ (రావు రమేష్) అంటే అతడికి అమితమైన గౌరవం. ఐతే హోం మినిస్టర్ గురుసింగం (ముకేష్ రుషి) సీఎంకు సంబంధించి పది వేల కోట్ల రూపాయల డబ్బులకు సంబంధించిన డీల్ లో రాజశేఖర్ తో పాటుగా గాంధీ కుటుంబం ఇరుక్కుపోతుంది. ఈ క్రమంలో గాంధీ భార్య.. అత్తమామలు చనిపోతారు. వాళ్లను చంపిన కేసులో ఇరుక్కుని గాంధీ జైలు పాలవుతాడు. అతడి కూతురు దిక్కు లేనిదవుతుంది. ఆ పాపను కాపాడ్డం కోసం సైకాలజీ స్టూడెంట్ అయిన పూజ (మీనాక్షి చౌదరి) కోర్టులో స్పెషల్ పిటిషన్ వేసి తనకు బెయిల్ వచ్చేలా చేస్తుంది. జైలు నుంచి బయటపడ్డ గాంధీ గురించి నిజ స్వరూపం తెలిసి పూజ షాకవుతుంది. ఇంతకీ అతనెవరు.. తన నేపథ్యమేంటి.. ఈ పది వేల కోట్ల డబ్బుల డీల్ తో అతడికి సంబంధమేంటి.. చివరికీ డబ్బులు ఎవరి సొంతమయ్యాయి అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ : మాస్ రాజా అభిమానులు మెచ్చే ఎనర్జీతో కనిపించాడు. అతడి మేనరిజమ్స్.. ఫైట్లు.. ఛేజింగ్ సీన్లు.. అభిమానులతో పాటు మాస్ ను ఆకట్టుకోవచ్చు. ఇక హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటీ పడి అందాలు ఆరబోశారు. పాటలన్నీ ఆ కోణంలో మంచి కిక్కే ఇస్తాయి. వారికి తోడు అనసూయ సైతం తన వంతు గ్లామర్ విందు చేసింది.

మైనస్ పాయింట్స్ : ‘ఖిలాడి’ని సీరియస్ గా తీసుకునే అవకాశమే లేకపోయింది. ట్విస్టులు థ్రిల్ చేయాలి కానీ.. కామెడీగా అనిపించకూడదు. అదే ‘ఖిలాడి’లో ఉన్న అతి పెద్ద మైనస్‌ పాయింట్‌.ప్రేక్షకుల్లో నీరసం తెప్పించేస్తుంది. ప్రథమార్ధంలో ‘డార్లింగ్’ సినిమా చూపించి ప్రేక్షకులకు షాకిచ్చిన దర్శకుడు రమేష్ వర్మ.. సెకండాఫ్ లోకి వచ్చేసరికి హిందీ ‘రేస్’ను దించేశాడు.

సాంకేతిక విభాగం: సుజీత్.. జీకే విష్ణుల విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. భారీ లొకేషన్లలో.. పెద్ద తారాగణంతో బాగా ఖర్చు పెట్టి సినిమా తీసిన విషయం తెరపై కనిపిస్తుంది. ఇక కథ-స్క్రీన్ ప్లే రచయిత.. దర్శకుడు రమేష్ వర్మ విషయానికి వస్తే.. అతను చాలా సినిమాల నుంచి స్ఫూర్తి పొంది స్క్రిప్టు తీర్చిదిద్దుకున్నట్లు అనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు పర్వాలేదనిపించాయి. నేపథ్య సంగీతం కమర్షియల్ సినిమాల మాదిరి సాగిపోయింది.

తీర్పు: ఓవరాల్ గా చూస్తే ఖిలాడి నుంచి ఆశించే స్థాయి వినోదం లేదు.
విడుదల తేదీ :11/02/2022
రేటింగ్-2/5
నటీనటులు: రవితేజ,డింపుల్ హయతి,మీనాక్షి చౌదరి.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: కోనేరు సత్యనారాయణ
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రమేష్ వర్మ

- Advertisement -