కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా జువెలర్స్ అండగా నిలిచింది. కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు తన వంతుగా సహకారం అందించింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో భారీ వితరణకు ముందుకు వచ్చింది. కేవలం వ్యాపారమే కాదు ప్రజల శ్రేయస్సు కూడా ముఖ్యమేనని భావించిన ఖజానా జువెలర్స్ కిషోర్ కుమార్, సామాజిక బాధ్యతగా రూ.3 కోట్ల విరాళాన్ని మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ కి హైదరాబాద్ లో అందచేశారు. ఈ నిధిని కరోనా వైరస్ నిర్మూలన, కరోనా బాధితుల సంరక్షణలో భాగంగా వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ కి వినియోగించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మంత్రి కెటి రామారావు మాట్లాడుతూ,ఖజానా జువెలర్స్ కిషోర్ కుమార్ ఔదార్యాన్ని అభినందించారు.వ్యాపారమే వ్యాపకమైనప్పటికీ, సేవా దృక్పథంతో,సామాజిక బాధ్యతతో కరోనా బాధితులను ఆదుకోవాలని,భారీ విరాళాన్ని అందచేయడం అత్యంత అభినందనీయమన్నారు. ఇలాంటి సందర్భాల్లో చేసే సాయమేదైనా,గొప్పదిగా ఉంటుందన్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, తన చిరకాల మిత్రుడు తరచూ ఇలాంటి సహాయాలు చేస్తుంటారని, అయితే ఈ సారి కరోనా బాధితులకు సాయం చేయడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. కెటిఆర్ తో కలిసి ప్రత్యేకంగా ప్రశంసించారు.
మరోవైపు కిషోర్ కుమార్ మాట్లాడుతూ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్ఫూర్తితో ఈ విధంగా ముందుకు వచ్చామన్నారు.ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ, ఆదుకుంటూ ఉంటారని చెప్పారు. ఇలా ప్రజల కోసం నిధిని విరాళంగా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ శశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త గౌతం జైన్ తదితరులు పాల్గొన్నారు.