మహబూబాబాద్,వరంగల్ పార్లమెంట్ అభ్యర్థుల గెలుపును భుజాన వేసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రెండు నియోజకవర్గల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. భద్రాచలంలో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పును లోక్ సభ ఎన్నికల్లో దిద్దుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని అన్నిజిల్లాల్లో టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ వస్తే ఒక్క ఖమ్మం జిల్లాలోనే ప్రజలు టీఆర్ఎస్‌ని ఓడించారన్నారు. అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా టీఆర్ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు.
ములుగు నుండి గెంటేసిన పోదెం వీరయ్యను భద్రాచలంలో గెలిపించి తప్పుచేశారని పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తప్పును దిద్దుకోవాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి మాలోతు కవితను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కి కానుకగా ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్ మునిగిపోయే పడవని ఎద్దేవా చేసిన ఎర్రబెల్లి పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా పింఛన్లు, రుణాలు ఇచ్చేది తానేనని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి 70 శాతం ఓట్లు వచ్చిన మండలాలను, 80 శాతం ఓట్లు వచ్చిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని తెలిపారు.