డ్రగ్స్ కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిట్ ఆఫీస్లో ఛార్మీ విచారణ జరుగుతుండగా ఆమె ఇచ్చిన సమాచారం మేరకే ఈ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరో గంటలో ఛార్మీ విచారణ ముగుస్తున్న క్రమంలో కొత్తగా అరెస్ట్ చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలపై ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ స్పష్టత ఇచ్చారు.
కేసుకు సంబంధించి ముఖ్యమైన అరెస్ట్ చేశామన్నారు.. నెదర్లాండ్స్ కు చెందిన యూరోపియన్ నేషనల్ మైక్ కమింగా అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు అకున్ సభర్వాల్ తెలిపారు.. డచ్ విసా మీద నాలుగు సార్లు ఇండియాకు వచ్చినట్టు గుర్తించామన్నారు.. ఈ వీసా 2018 వరకు ఉన్నట్టు తెలిపారు..
మల్టీ నేషనల్ కంపెనీలోని ఉద్యోగులకు మైకా కమింగా ద్వారానే డ్రగ్స్ సరఫరా అవుతుందని.. హైటెక్ సిటీ ఏరియాలో పని చేసే చాలా మంది సాప్ట్ వేర్ ఉద్యోగులకు ఇచ్చాడని తెలిపారు. ప్రస్తుతం మైకా దగ్గర భారత్ పాస్ పోర్ట్ కూడా ఉందని.. దాని గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నాడని వెల్లడించారు. డ్రగ్స్ సరఫరా మూలాలను సైతం పెకిలించే దిశగా సాగుతున్న సిట్ విచారణలో ఇది కీలక పరిణామం అన్నారు అకున్. ఇదిలా ఉండగా ఈ కేసు విషయంలో మరో వ్యక్తిని కూడా సిట్ ఆఫీస్లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.