The Kerala Story 2:సీబీఎఫ్‌సీని ప్రశ్నించిన కేరళ హైకోర్టు

5
- Advertisement -

ది కేరళ స్టోరీ 2 చిత్రం విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. సినిమాను నిషేధించాలని పిటిషన్లు దాఖలవగా మంగళవారం కేరళ హైకోర్టు కేంద్ర ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు (Central Board of Film Certification)కు ఇచ్చిన సర్టిఫికెట్‌పై ప్రశ్నలు లేవనెత్తింది.

టీజర్ విడుదలైన నాటి నుంచే ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. పిటిషనర్ల వాదనల నేపథ్యంలో, హైకోర్టు సీబీఎఫ్‌సీ పాత్రపై తీవ్రంగా స్పందించింది.కేరళ చాలా సెక్యులర్ రాష్ట్రం. సంపూర్ణ సౌహార్దంతో జీవిస్తోంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఇలా జరుగుతున్నట్లుగా చూపించే ముందు మీరు దీన్ని పరిగణనలోకి తీసుకున్నారా? ఇది తప్పుదారి చూపే సూచన కావచ్చు, భావోద్వేగాలను రెచ్చగొట్టవచ్చు. అలాంటి సందర్భాల్లోనే సెన్సార్ బోర్డు పాత్ర ముఖ్యమవుతుంది అని తెలిపారు న్యాయమూర్తి.

అదే విధంగా, సినిమా ‘నిజ సంఘటనల ఆధారంగా’ రూపొందించామని చెబుతున్నందున పిటిషనర్ల ఆందోళనలు సమంజసంగానే కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మీరు సినిమాకు ‘కేరళ’ అనే పేరు పెట్టారు. ప్రజల ఆందోళనలను నిర్లక్ష్యం చేయలేం. సాధారణంగా కళాత్మక సృష్టిలో కోర్టు జోక్యం చేసుకోదు. కానీ ఇది నిజ సంఘటనల ఆధారంగా ఉందని చెప్పడం, రాష్ట్ర పేరును ఉపయోగించడం వల్ల సామాజిక ఉద్రిక్తతలు తలెత్తే అవకాశముంది అని జస్టిస్ థామస్ అన్నారు.

సృజనాత్మక స్వేచ్ఛ ఉంది. కానీ సీబీఎఫ్‌సీ విధించిన కొన్ని షరతులు పాటించాలి. వాటి గురించి మీకు అవగాహన ఉందా? సినిమా ద్వారా అపోహలను సరిదిద్దవచ్చు. కానీ ఇది కేవలం కల్పితం కాదు; ‘నిజ సంఘటనల ఆధారంగా’ ఉందని మీరు చెబుతున్నారు. దానికి పెద్ద ప్రభావం ఉంటుంది అని తెలిపారు.

సినిమా నిర్మాతల తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ ఎస్. శ్రీకుమార్ కోర్టుకు హామీ ఇచ్చారు. తీర్పు వచ్చే వరకు విడుదలైన టీజర్లను తొలగిస్తామని. అలాగే, కేసుపై తుది నిర్ణయం తీసుకునే ముందు జస్టిస్ థామస్‌కు ప్రత్యేకంగా సినిమా ప్రదర్శన ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. మొత్తంగా, ‘ది కేరళ స్టోరీ 2’పై న్యాయపరమైన విచారణ కొనసాగుతుండగా, కోర్టు తీర్పు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Also Read:TG:తెలంగాణ రెయిన్ అలెర్ట్!

- Advertisement -