మతాన్మాదం, కులోన్మాదం వలన ఎంతో మంది ప్రేమికులు చనిపోతూనే ఉన్నారు. మతాలు వేరు కావడంతో ఇంట్లో వారు ఒప్పుకోక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. మతోన్మాదుల చేతిలో మరికొందరు బలై పోతున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ ప్రేమ జంట మతాంతర వివాహం చేసుకుందని.. ఓ ఉగ్రవాద భావాలు కలిగిన సంస్థ చంపేస్తామంటూ బెదిరిస్తోంది. కేరళకు చెందిన హ్యారిసన్ క్రిస్టియన్, ప్రేమించి ముస్లిం యువతి షహానాని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు హ్యారిసన్. కొద్ది సేపటి తరువాత ఏడుస్తూ మరో వీడియో పెట్టాడు.
మతాంతర వివాహం చేసుకున్నందుకు తనను చంపేస్తామంటూ ఉగ్రమూలాలు గల సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా బెదిరింపులకు పాల్పడుతుందని తెలిపాడు. నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు. కేరళలో నేను మరో కెవిన్ ను కాలేను, మతాంతర వివాహం చేసుకున్న కెవిన్ ని చంపేశారు.. నేను తన లాగే చనిపోవాలని అనుకోవడం లేదంటూ హ్యారిసన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వీడియోలో షహానా మాట్లాడుతూ.. ప్రేమ అనేది మతాలకు, కులాలకు సంబంధించింది కాదు. మనసులను సంబంధించి. నాకు హ్యారిసన్ అంటే ఇష్టం.. తనతో జీవితాం నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. కానీ నా కుటుంబ సభ్యులే ఇప్పుడు నా భర్తను, ఆయన ఫ్యామిలీని చంపేస్తామంటున్నారు. ప్రేమిస్తే చంపేస్తారా..? అయినా మమ్మల్ని చంపితే మీకే వస్తుందంటూ కన్నీటి పర్యంత మయ్యింది. ఈ ఘటనపై మాకు ఎలాంటి సమాచారం లేదంటూ పోలీసులు అనడం గమనార్హం.