ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రముఖ నటుడు కమల్ హాసన్‌తో నేడు భేటీ కానున్నారు. మహారాష్ట్రలోని ఇగట్‌పురిలో 9 రోజుల మెడిటేషన్ అనంతరం మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న కేజ్రీవాల్ కమల్ హాసన్‌ను కలవనుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు కమల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో కమల్ హాసన్, కేజ్రీవాల్ భేటీపై ఆసక్తికరంగా మారింది. వీరి ఇద్దరి మధ్య తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశముంది.
కమల్ కొత్త పార్టీ కనుక పెడితే ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ముందుకు వెళ్లే ఆలోచనతో ఉన్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరి భేటీలో ఇదే విషయం చర్చకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, ఇదే నెల మొదట్లో కమల్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కూడా కలిశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఆవల కూడా బలపడాలని భావిస్తోంది. ముఖ్యంగా దక్షిణాదిలోనూ తన ప్రస్థానాన్ని ప్రారంభించాలని ఉబలాటపడుతోంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గోవా, పంజాబ్‌లోనూ పోటీ చేసింది. రెండింటిలోనూ ఓడిపోయినా పంజాబ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇప్పుడు దక్షిణాదిన కమల్‌ను కలుపుకుపోవడం ద్వారా బలీయమైన శక్తిగా ఎదగాలని కేజ్రీవాల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.