ముచ్చటగా మూడోసారి…. ఊడ్చేశాడు!

343
kejriwal

అమిత్ షా వర్సెస్ కేజ్రీవాల్‌ కేంద్రంగా సాగిన ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయబావుటా ఎగురవేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకుంది ఆప్‌. ప్రస్తుతం కౌంటింగ్ సరళిని పరిశీలిస్తే 54 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న ఆప్‌…ఢిల్లీలో గద్దెనెక్కి సీఎం పీఠంపై కూర్చోవాలని భావించిన బీజేపీకి షాకిచ్చింది.

పోటీ త్రిముఖం అని భావించినా ఒక్కటంటే ఒక్కసీటూ గెలవలేక… కాంగ్రెస్‌కు శూన్య‘హస్తం’ మిగిలింది. గల్లీగల్లీల్లో ఉన్న సామాన్య ప్రజలంతా ఏకమై ఢిల్లీ ఎన్నికల్లో తమను తాము గెలిపించుకున్నారు. విస్తృత ప్రచారాలను తిప్పికొట్టారు. బెదిరింపుల్ని ఎదిరించారు. అహంకార పూరిత ధోరణి రాజకీయాలను మట్టి కరిపించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ ఘన విజయం సాధించారు. చీపురు తో ఢిల్లీ ఎన్నికల బరిని క్లీన్‌ స్వీప్‌ చేసేశారు.

ఆప్‌ విస్పష్ట విజయం ఖాయమవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆప్‌ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆరు జిల్లాల్లో ఆప్‌ ఏకపక్షంగా దూసుకుపోతోంది.