నేను… శైలజ’ సినిమాతో తెరంగేట్రం చేసి బంపర్ హిట్ కొట్టేసింది కీర్తి సురేష్. అమ్మడికి అవకాశాలు వెల్లువలా తలుపుతట్టాయి. అయినా సెలెక్టెడ్‌గా తెలుగులో సినిమాలను ఎంచుకుంటుంది కీర్తి. ప్రస్తుతం నానితో నేను లోకల్ సినిమాలో నటిస్తున్న కీర్తి… జూ.ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’, మహేష్-మురుగదాస్ సినిమాలోనూ నటించమని ఆఫర్లు వచ్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కీర్తి సురేష్ కి ఈ ఆఫర్ ఇస్తున్నాడట.

సినిమా స్టోరీ.. నటుల విషయంలో కొరటాల ఎంత పక్కాగా ఉంటాడో తెలిసిన విషయమే. అందుకేనేమో ఆయన తీసిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. మొదట మిర్చిలో అనుష్కను.. శ్రీమంతుడులో శ్రుతి హాసన్ ను.. రీసెంట్ గా జనతా గ్యారేజ్ లో సమంతను తీసుకున్న కొరటాల శివ.. ఇప్పుడు మహేష్ బాబుతో చేయనున్న తన రెండో సినిమాలో కీర్తి సురేష్‌ను తీసుకోవాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం శివ కార్తీకేయన్ సినిమా రెమోలో కీర్తి యాక్టింగ్‌కు కొరటాల ఫిదా అయ్యాడట. ఇంకేముంది మహేష్ సినిమా కోసం అడగడం.. కీర్తి సురేష్ వెంటనే ఒప్పేసుకోవడం జరిగిపోయాయి. స్టార్ హీరోయిన్లను ప్రిఫర్ చేసే మహేష్ బాబు కూడా కీర్తి సురేష్‌నే తీసుకోవాలని భావిస్తున్నాడట.

మహేష్ కెరీర్‌లో 24వ సినిమా పూజా కార్యక్రమాలు నవంబర్ 9న జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్ అను నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ఇందులో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నారు.
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2017 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.