మిడ్ మానేరు ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన కేసీఆర్…అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల్లో జాప్యం కారణంగానే మిడ్ మానేరు కు గండి పడిందని ఆరోపించారు. గత పాలకుల వైఫల్యం కారణంగానే పనులు పూర్తి కాలేదని విమర్శించారు.
కొత్తగా టెండర్లు పిలిచి త్వరగా పనులు పూర్తి చేయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాంట్రాక్టు పనుల్లో 5 శాతం లెస్సు తేడాతో పనులు అప్పగించేలా జోవో తెస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో కరువు అనేదే ఉండదన్నారు. ప్రజలు వానలను చూసి చాలా సంతోషిస్తున్నారని పేర్కొన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లాలో మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యాంలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిజాం సాగర్ నుంచి 90 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉందని తెలిపారు.
ఎల్‌ఎండీ నిండిందని ఇంకా మరో మూడు టీఎంసీల నీరు నిండాల్సి ఉందన్నారు. జూరాల నిండిపోయి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వస్తోందని తెలిపారు. ఆల్మట్టి, నారాయాణపూర్ జలాశయాలకు వరద వస్తోందన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం పెద్దగా జరగలేదని, ఏదైనా పిడుగుపాటు ఇలాంటివి జరిగాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల నష్టపరిహారం అందిస్తామన్నారు. జూరాల నిండిపోయి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వస్తుందని వివరించారు. అధికారులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి విపత్తు సంభవించకుండా చూసుకోవాలని ఆదేశించారు.