రికార్డులను తిరగరాసే దమ్మున్న నాయకుడు కేసీఆర్

476
Minister-KTR-Speech
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఇవాళ తెలంగాణ భవన్‌ లో మంత్రులు కడియం శ్రీహరి,  కేటీఆర్, ఈటెల రాజేందర్‌ల సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి మంత్రులు కేటీఆర్‌, ఈటెల రాజేందర్‌ లు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

Minister-KTR-Speech

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సీఎం కేసీఆర్‌ పాలనపై నమ్మకంతోనే నేతలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటుందని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు అహర్నిషలు పని చేస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాన్ని జ్యోతి బసు 30 సంవత్సరాల పాటు నిర్వీరామంగా పాలించారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా సీఎం కేసీఆర్‌ జ్యోతిబసులాగే పాలన కొనసాగిస్తారని, జ్యోతిబసు పాలన రికార్డును తిరగరాసే దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని  మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Minister-KTR-Speech

అస్ధిత్వం కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని, బీహార్‌ జార్ఖండ్‌ రాష్ట్రాలు విడిపోయినప్పుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ జార్ఖండ్‌ లో ఉనికి కోల్పోయిందని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా తెలంగాణలో టీడీపీ పార్టీ కనుమరుగైపోయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన ప్రతి ఒక్క నాయకునికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని అన్నారు మంత్రి కేటీఆర్‌. టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన వారిలో జయశంకర్‌ భూపాలపల్లి టీడీపీ పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ, రాజన్న సిరిసిల్ల జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు నర్సింగరావు, మంథని టీడీపీ పార్టీ ఇంచార్జ్‌ కర్రు నాగయ్య, హుస్నాబాద్‌ టీడీపీ పార్టీ ఇంచార్జ్‌ రవీందర్‌ రావులతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

- Advertisement -