ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగానికి సిద్ధమయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 21 నుంచి 25 వరకు మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన ముఖ్యమంత్రి.. స్వయంగా యాగం ఏర్పాట్లను పరిశీలించారు.
శృంగేరి శారదాపీఠం సంప్రదాయం ప్రకారం ఈ యాగం జరగనుండగా 200 మంది రుత్వికులు పాల్గొననున్నారు. సహస్రచండీయాగంలో భాగంగా తొలిరోజు వంద, రెండో రోజు 200, మూడో రోజు 300, నాలుగో రోజు 400 వందల సప్తశతి పారాయణాలు చేస్తారు. ఐదో రోజున 11 హోమగుండాల వద్ద ఒక్కో గుండానికి 11 మంది రుత్వికులు చొప్పున 100 పారాయణాల స్వాహాకారాలతో హోమం నిర్వహిస్తారు. అనంతరం పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమవుతుంది. ఈ యాగానికి సీఎం కేసీఆర్ పలువురు ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
విశాఖలోని శారదాపీఠాన్ని సందర్శించిన కేసీఆర్, మరో యాగం గురించి పీఠాధిపతి స్వరూపానంద సరస్వతితో చర్చించినట్టు సమాచారం. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జనవరి 21 నుంచి సహస్ర చండీయాగం నిర్వహణకు ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తోంది. జనవరి 21 నుండి 25 వరకు ఈ యాగం జరగనుంది.