మంగళవారం తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. మన రాష్ట్ర రైతాంగం పండిచినంటువంటి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది అని సీఎం ధ్వజమెత్తారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత దేశ ఆహార అవసరాల నిమిత్తం బపర్ స్టాక్స్ మెయింటెన్ చేయాలన్సిన బాధ్యత కేంద్రానిది. వడ్లు కొంటే ప్రాసెసింగ్‌లో భాగంగా బియ్యం చేయడం కూడా కేంద్రం ఆధీనంలో ఉన్నది. ఎఫ్‌సీఐ గోడౌన్లు ధాన్యాన్ని నిల్వ చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఇవాళ రాష్ట్రానికో నీతి, ప్రాంతానికో నీతి అనే పద్ధతిలో వ్యవహరిస్తోందని అన్నారు.
పంజాబ్‌లో మొత్తం వరి ధాన్యాన్ని కొంటున్నారు. మన వద్ద నిరాకరిస్తున్నారు. కేంద్రం నుంచి ఉలుకుపలుకు లేదు. సమాధానం లేదు. ఎఫ్‌సీఐ కొంటామని చెప్పి, కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో కన్ఫ్యూజన్ వచ్చింది. దీన్ని నిర్ధారించుకునేందుకు ఢిల్లీకి వెళ్లి సంబంధింత మంత్రిని కలిశాను. స్పష్టంగా అడిగాను. మీరు తీసుకున్న నిర్ణయాలు బాలేవు. మా రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని అడిగాము. పరిశీలిస్తామని కేంద్రమంత్రి చెప్పారు. కానీ స్పష్టత ఇవ్వాలని అడిగాను. నా అభ్యర్థన మేరకు మరుసటి రోజు ఎఫ్‌సీఐ, ఆహార శాఖ అధికారులను పిలిచి నా సమక్షంలోనే డిబేట్ చేశారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్‌లో చర్చించి ఐదు రోజుల్లో చెప్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు ఉలుకుపలుకు లేదు.
యాసంగిలో కొంటామని గతంలో ఎఫ్‌సీఐ చెప్పి కేంద్రం నిరాకరించింది. అప్పుడు కేంద్రాన్ని నిలదీశాం. కేంద్రం ఆలస్యం చేస్తోంది. రైతు వ్యతిరేకంగా కేంద్రం ఉంది. దీంతో మేం అప్రమత్తమయ్యాం. మీరు ధాన్యం పండించకండి. పంట మార్పిడి చేయండి అని వ్యవసాయ శాఖ మంత్రి మన రైతులకు విజ్ఞప్తి చేశారు. వరి ధాన్యం కొన్నాక బియ్యం చేసి నిల్వ చేయాలి. కానీ ఆ పరిస్థితి లేదు. బియ్యం నిల్వ చేసే పరిస్థితి ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. బియ్యం నిల్వ చేసేందుకు గోడౌన్లు కూడా లేవు. తెలంగాణలో వచ్చిన ధాన్యాన్ని గత యాసంగిలో జూనియర్ కాలేజీ, రైతువేదిక, ఫంక్షన్ హాఅల్స్‌లో స్టాక్ చేశాం. ఆ ధాన్యం నిల్వ చేయడానికి కారణం కేంద్రం కన్ఫ్యూజన్ వల్లే. ఆ ధాన్యం ఇప్పటికీ కూడా గోదాముల్లోనే ఉంది. గత యాసంగిలో 5 లక్షల ధాన్యాన్ని కొంటామని చెప్పిన కేంద్రం నుంచి ఉలుకుపలుకు లేదు. ఇప్పుడేమో అసలు మాట్లాడుతలేరు. కానీ ఈ రోజు వరకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతూ యాసంగిలో వరి పంట వేయాలని రైతులను రెచ్చగొట్టారు. దీంతో కేంద్రమంత్రికి నేనే స్వయంగా ఫోన్ చేసి.. సంజయ్ వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాను. పొరపాటు అయిందని కేంద్రమంత్రి తనతో అన్నారు. తెల్లారి తానే ప్రెస్‌మీట్ పెట్టి ఆయనను అడిగాను. కానీ స్పందన లేదు. వర్షాకాలం పంటను కొంటామని చెప్పాను. కేంద్రం నిర్ణయంతో యాసంగిలో వరి పంటను కొనలేమని చెప్పాను. వర్షాకాలం పంట కోసం 6600 పైచిలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ నేతలు డ్రామాలడుతున్నారు. రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే.. బీజేపీ నేతలు సూటిగా చెప్పకుండా.. అడ్డగోలుగా మాట్లాడి విధ్వంసం సృష్టిస్తున్నారు. రాళ్లతో రైతులపై దాడులు చేస్తున్నారు. ఇది ఏం పద్ధతి? అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.