ఇప్పటివరకు పాలనపై దృష్టిసారించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. ఇప్పటికే పలు దఫాలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ…కార్యకర్తలకు న్యాయం చేస్తున్న సీఎం కేసీఆర్ త్వరలో అన్ని జిల్లాల పార్టీల అధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులను నియమించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే తీవ్ర కసరత్తు జరుగుతోంది. పార్టీ పటిష్టత,ప్రజాప్రతినిధులకు పరిపాలనలో మెళకువలు అందించటంలో భాగంగా ఇప్పటికే నాగార్జున సాగర్‌లో శిక్షణ తరగతులు నిర్వహించిన సీఎం కేసీఆర్..మరోసారి క్లాసులు నిర్వహించాలన్న యోచనలో ఉన్నారట.
ప్రజాసేవే పరమార్థమన్న భావనను ప్రజాప్రతినిధుల్లో పెంచడం..ప్రభుత్వ నిర్వహణలో ప్రజాప్రతినిధుల పాత్ర, శాసనసభలో హుందాగా వ్యవహరించడం, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం, ప్రజలు మెచ్చేనేతగా ఎలా వ్యవహరించాలి అనే తదితర అంశాలపై పార్టీ సీనియర్ నేతలతో పాటు నిపుణులతో ట్రైనింగ్ క్లాసులు ఇప్పించనున్నారు. రాజకీయ పాఠాలను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే బోధిస్తారని పార్టీ వర్గాల సమాచారం.
తర్వాత కొత్త జిల్లాల అధ్యక్షులు,పార్టీలోని అనుబంధ సంఘాల నేతలకు విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఇప్పించే యోచనలో ఉన్నారట. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి అయింది.. ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్ కు తిరుగులేదని సర్వేలు చెబుతున్నాయ్. కానీ టీఆర్ఎస్ లో చాలా మంది ప్రజా ప్రతినిధులకు ఇంకా ప్రభుత్వం పథకాలపై సరైన అవగాహన లేదు. ప్రతిపక్షాల విమర్శలకు సరైన సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఎమ్మెల్యేలకు మూడు రోజులు క్లాసులు తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో అధికార పార్టీ నేతలు విఫలమవుతున్నారు. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలకు ఓ అవగాహన కల్పించాలనుకుంటున్నారు కేసీఆర్. కొత్త జిల్లాలో పాలన ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా క్లాసులు ఇవ్వనున్నారు. ఈ శిక్షణ తరగతులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పలు జిల్లాల నేతలు హాజరుకానున్నారు. ఈ దిపావలి తర్వాత నేతలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారు.
గతంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని టీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు ప్రగతి రిసార్ట్ప్‌లో శిక్షణా తరగతులు నిర్వహించిన సంగతి తెలిసిందే.