ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నై పర్యటనకు బయల్దేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో తమిళనాడు బయల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు కేకే, వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.
ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమవుతారు. ఆ తర్వాత 2 గంటలకు అల్వార్‌పేటలోని స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయనతో గంటసేపు సమావేశమవుతున్నారు. అక్కడే అంతా కలిసి భోజనం చేయనున్నారు. ఆదివారం రాత్రి అక్కడే బస చేసి, సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమవుతారు.
దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ విషయంలో తన ప్రయత్నాల్లో వేగం పెంచారు. ఫెడరల్ ఫ్రంట్‌లో అన్ని రాష్ర్టాలకు ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్న కేసీఆర్.. దేశహితంకోసం కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలతో, నాయకులతో చర్చలను ముమ్మరం చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పుడు మరో ముందడుగు వేస్తున్నారు. పార్టీ ప్లీనరీలో ప్రకటించినట్లుగానే.. ఫెడరల్ ఫ్రంట్ మద్దతు కూడగట్టేందుకు ఆయన ఆదివారం చెన్నై వెళ్తున్నారు. అక్కడ ఆయన డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, ఆయన తనయుడు స్టాలిన్‌తో విడివిడిగా భేటీ కానున్నారు.
ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించిన సీఎం.. తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం తమిళనాడు రాజధాని చెన్నైకి వెళ్లి, డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో సమావేశంకానున్నారు.
కరుణానిధి ఆరోగ్యంపై వాకబు చేయడంతోపాటు ఫ్రంట్ గురించి ఆయనతో చర్చిస్తారు. అనంతరం తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో సమావేశమై, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చలు జరుపుతారు. గత బుధవారం పలువురు డీఎంకే నాయకుల ప్రతినిధి బృందం హైదరాబాద్‌కు వచ్చి ఫెడరల్ ఫ్రంట్‌పై సీఎం కేసీఆర్‌తో సమావేశమైంది. వారి ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్, పార్టీ పార్లమెంటరీ నేత కేశవరావు, ఎంపీ కవితలతో కూడిన బృందం చెన్నైకి బయల్దేరి వెళ్తున్నట్టు సమాచారం. పలువురు స్థానికులతోనూ చర్చలు జరిపి, అదేరోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదిపార్టీ నేత అఖిలేశ్‌యాదవ్ మే 2వ తేదీన హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో సమావేశమై, ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించనున్నారు. గత బుధవారం రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ లక్నో వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్‌పై ఇరువురు చర్చించుకున్నట్టు సమాచారం. దానికి కొనసాగింపుగా అఖిలేశ్ హైదరాబాద్ వచ్చి, సీఎం కేసీఆర్‌తో సమావేశమవనున్నారు. ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నవీన్‌పట్నాయక్ కూడా సానుకూలంగా స్పందించి భువనేశ్వర్‌కు రావాల్సిందిగా కేసీఆర్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అఖిలేశ్‌యాదవ్‌తో భేటీ తదుపరి భువనేశ్వర్‌కు వెళ్లాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన చేసినప్పుడు ఉత్తర భారతంలోని రెండు కీలక రాష్ట్రాలకు చెందిన రెండు ప్రాంతీయ పార్టీల నేతలు ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతు ప్రకటించారు. వారు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడినట్లు తెలిసింది.
దేశాభివృద్ధికోసం, సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టేందుకు జరుగుతున్న కృషిలో తాము కూడా భాగస్వాములవుతామని కబురుపెట్టారు. ఫెడరల్ ఫ్రంట్‌కు కలిసి వచ్చే నేతలందరితో కేసీఆర్ ఒక సమావేశాన్ని ఏర్పాటుచేస్తారని తెలిసింది. దేశవ్యాప్తంగా కీలక నగరాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, ఫ్రంట్ స్వరూప, స్వభావాల గురించి వివరిస్తారని సమాచారం. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో హైదరాబాద్ శివార్లలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసి నడువాలనుకునే నేతలందరినీ సభకు ఆహ్వానిస్తారని సమాచారం. శుక్రవారం టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లీనరీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతపై చేసిన ప్రసంగం ఆలోచింపజేసేలా ఉందంటూ పలు మీడియా సంస్థలు జాతీయస్థాయిలో చర్చించాయి. ముఖ్యంగా రైతాంగ సమస్యలు, వివిధదేశాలతో మనదేశాన్ని పోలుస్తూ అంకెలతో సహా విడమరిచి చెప్పడం ఆలోచింపజేసింది.