దేశ రాజకీయాల్లో మార్పే లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా సీఎం కేసీఆర్ మరో ముందడుగు వేశారు. మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడతో భేటీ అయ్యారు. బెంగళూరులోని దేవెగౌడ నివాసం అమోఘలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్.. కొత్తకూటమి, బీజేపీ, కాంగ్రెస్‌ల వైఖరి, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రిజర్వేషన్ల పెంపుదల బిల్లుకు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జేడీఎస్ సహకారం కోరనున్నారు.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రత్యేకవిమానంలో సీఎం కేసీఆర్ బెంగళూరుకు వెళ్లారు. కేసీఆర్‌తో పాటు ఎంపీలు కేశవరావు, వినోద్ కుమార్,సంతోష్ కుమార్,శేరి సుభాష్ రెడ్డి పలువురు ఉన్నారు.
కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు సాగిన ఈ భేటీలో ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాల గురించి చర్చించారు.
తర్వాత ఝూర్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ను కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును స్వాగతించారు.