హైదరాబాద్ వాసుల మెట్రో కల నెరవేరబోతోంది. నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్రమోడీ,సీఎం కేసీఆర్ మియాపూర్‌లో మధ్యాహ్నం 2.15 నిమిషాలకు మెట్రోను ప్రారంభించనున్నారు. ఇప్పటికే పట్టాలెక్కి ట్రయిల్ రన్ విజయవంతంగా ముగించుకున్న మెట్రో…ఈ నెల 29 నుంచి జంట నగరాల్లో చక్కర్లు కొట్టనుంది. ఇప్పటిదాకా ట్రయిల్ రన్ చూసి మురిసిపోయిన ప్రజలు..ఇప్పుడు ఏకంగా ట్రైన్ ఎక్కి తమ ముచ్చట తీర్చుకోనున్నారు.
తొలిదశలో (నాగోల్-బేగంపేట, మియాపూర్-అమీర్‌పేట) 30 కిలో మీటర్లు మెట్రో అందుబాటులోకి రానుంది. మెట్రో పనులు శరవేగంగా జరగడంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే.. మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తికాదు.. రైలు ఎక్కేందుకు జనాలుండరు.. ఎల్‌అండ్‌టీ వెనుకకుపోవడం ఖాయమంటూ విషప్రచారం జరిగింది. కానీ అదంతా దుష్ప్రచారమేనని అనతికాలంలోనే తేలిపోయింది.
మెట్రోకు నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన చేయూత కన్నా.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రొత్సాహమే ఎక్కువ. సీఎం కేసీఆర్ చూపించిన ప్రత్యేక చొరవకు తోడు ఎల్ అండ్ టీ,అధికారుల సమన్వయంతో మెట్రో పరుగులు పెట్టేందుకు సిద్దమైంది. నాడు మొక్కవోని దీక్షతో తెలంగాణ సాధించి చూపించిన కేసీఆర్ నేడు బంగారు తెలంగాణ సాధనలో భాగంగా మెట్రోను ప్రజలకు చేరువ చెయ్యడంలో అంతే చొరవను ప్రదర్శించారు. ఫలితంగా అన్నిఅవాంతరాలను అధిగమించి మెట్రో పరుగులు పెట్టేందుకు సిద్దమైంది.
కేసీఆర్ విజన్ తోడు కేటీఆర్ పట్టుదల,కృషితో పరుగులు పెట్టేందుకు సిద్దమైంది. మెట్రో పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేటీఆర్ పలుమార్లు స్వయంగా రివ్యూలు నిర్వహిస్తునే పనుల వేగవంతానికి చర్యలు తీసుకున్నారు. గవర్నర్ నరసింహన్‌తో కలిసి మెట్రో పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుతో పాటు అత్యాధునిక సాంకేతికతను గవర్నర్‌కు వివరించారు. మెట్రో ట్రయల్ రన్‌లో భాగంగా మంత్రులు,ఎమ్మెల్యేలతో కలిసి నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు ప్రయాణించిన కేటీఆర్.. వచ్చే ఏడాదికల్లా పూర్తిస్ధాయిలో మెట్రోను అందుబాటులోకి తెచ్చేవిధంగా ప్రయత్నాలు మొదలుపెట్టామని వెల్లడించారు.
కేసీఆర్,కేటీఆర్ కృషి ఫలితంగా ప్రపంచంలోనే ప్రభుత్వ,ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటైన తొలి మెట్రోగా హైదరాబాద్ నిలవనుంది. ఎన్నోఏళ్లుగా కలగానే మిగిలిపోయిన మెట్రో పరుగులు పెట్టేందుకు సిద్దంగా ఉండటంతో గ్రేటర్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసలు గుప్పిస్తున్నారు.