ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంతో పాటు వారికి కీలక బాధ్యతలను అప్పగించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇప్పటికే పంచాయతీరాజ్, పురపాలక కొత్త చట్టాల్లో వారికి ముఖ్య అధికారాలు కట్టబెట్టారు సీఎం కేసీఆర్. అంతేకాదు కీలక నిర్ణయాలను తీసుకునే వీలు కల్పించారు. త్వరలో రానున్న కొత్త రెవెన్యూ చట్టంలోనూ కలెక్టర్లకు ప్రాధాన్యం కల్పించబోతున్నారు సీఎం. వీటన్నింటిపైనా దిశానిర్దేశం చేసేందుకు సీఎం కేసీఆర్ మంగళ, బుధవారాల్లో ప్రగతిభవన్‌లో కలెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు నేడు సీఎం కలెక్టర్లతో భేటీ కానున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, సీఎస్, సంబంధిత శాఖల కార్యదర్శులు పాల్గొంటారు. ఒకపైసా లంచం ఇవ్వకుండా ప్రజలకు సత్వరం సేవలు అందేలా నూతన రెవెన్యూ చట్టం రూపొందాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న సీఎం కేసీఆర్.. ఈ సమావేశంలో కలెక్టర్లందరి నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. వాటిని క్రోడీకరించి నూతన చట్టంలో పొందుపరిచే అవకాశం ఉంటుంది.
కొత్తగా అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్,పురపాలక చట్టాల అమలు విషయంలో కూడా అభిప్రాయాలను ఈ సమావేశంలో తీసుకోనున్నారు. పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి నిర్దేశించిన 60 రోజుల ప్రణాళికపైనా సమావేశంలో చర్చిస్తారు. కొత్త చట్టం రూపకల్పనతోపాటు, అమలులోకి వచ్చిన చట్టాల అమలు,60 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలుపై జిల్లా కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశనం చేయనున్నారు.